ఏపీ కేబినెట్‌ సమావేశం సోమవారం ఉదయం ప్రారంభమయ్యింది.  ఈ సమావేశంలో ప్రభుత్వం పలు విషయాలపై చర్చిస్తోంది. అయితే.. కేబినెట్ ఎజెండా విషయంలో ప్రభుత్వం అత్యంత గోప్యంగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా ఏడు అంశాలపై కేబినెట్‌ సమావేశంలో చర్చ జరుగుతోందని తెలుస్తోంది. హైపవర్ కమిటీ నివేదిక, సిఫార్సులపై కేబినెట్ చర్చించనున్నట్టు తెలుస్తోంది. పాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి బిల్లుపై చర్చ జరగనున్నట్టు సమాచారం.

Also Read రాజధాని రచ్చ: ప్రకాశం బ్యారేజీపై రాకపోకలు బంద్...

 రాష్ట్రంలో 4 జోన్లు ఏర్పాటు నిర్ణయంపై కేబినెట్ చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. సీఆర్డీఏ చట్టం ఉపసంహరణ బిల్లు.. అమరావతి మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటుపై చర్చ జరుగుతున్నట్టు సమాచారం. రాజధాని రైతుల అంశంపై చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణను లోకాయుక్తకు అప్పగించడానికి ఆమోదం తెలపనున్నట్టు తెలుస్తోంది. పులివెందుల అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటుతో పాటు.. రైతు భరోసా కేంద్రాలపై కేబినెట్‌ చర్చించనున్నట్టు సమాచారం.