ఆ వ్యక్తి కన్నుమూసినా.. మరెందరో మంది కుటుంబాల కళ్లల్లో వెలుగులు నింపారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన ఆ యువకుడి అవయవదానం వల్ల ఎనిమిది మందికి పునర్జన్మ దక్కింది. గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, కళ్లు, రెండు కిడ్నీలూ అన్నింటినీ దానం చేశారు. 

అమరావతి: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్(Brain Dead) అయిన ఓ యువకుడి అవయవాలు(Organs) మరో ఎనిమిది మందికి పునర్జన్మ ఇచ్చాయి. తాను కన్నుమూసినా.. ఎనిమిది మంది కుటుంబాల కన్నుల్లో వెలుగులు నింపాడు. బ్రెయిన్ డెడ్ అయిన ఆ యువకుడి అవయవదానం(Organ Donation) వల్ల ఎనిమిది మందికి పునర్జన్మ దక్కింది. గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, కళ్లు, రెండు కిడ్నీలూ అన్నింటినీ దానం చేశారు.ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంది. అవయవాల తరలింపునకు పోలీసులు గ్రీన్ చానెల్ ఏర్పాటు చేశారు. ఈ గ్రీన్ చానెల్ ద్వారా అవయవాలను వివిధ ఆస్పత్రులకు వేగంగా చేరవేయగలిగారు.

Andhra Pradeshలోని కృష్ణా జిల్లా మచిలీపట్టణానికి చెందిన ఎం కోటేశ్వరరావు (27) పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలులో వివాహానికి హాజరవ్వడానికి బయల్దేరాడు. టూ వీలర్‌పై పెళ్లి కోసం వెళ్లాడు. ఆ ద్విచక్ర వాహనంపై కోటేశ్వరరావు వెనుక కూర్చున్నారు. వారు రోడ్డుపై ప్రయాణిస్తుండగా ఓ కారు వెనుక నుంచి వచ్చి ఢీ కొట్టింది. ఆ వెంటనే ఆయన కిందపడిపోయారు. దీంతో తలకు తీవ్ర గాయం అయింది. చికిత్స కోసం ఆయన బంధువులు స్థానిక హాస్పిటల్‌కు పంపారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం అదే రోజు రాత్రి ఎన్ఆర్ఐ హాస్పిటల్‌‌కు తరలించారు. వైద్యులు కోటేశ్వరరావుకు మెరుగైన చికిత్స అందించారు. కానీ, కోటేశ్వరరావు ఆ వైద్యానికి స్పందించలేదు. కోమాలోకి జారుకున్నాడు.

హాస్పిటల్ న్యూరో సర్జన్ డాక్టర్ తోటకూర అమిత్ కుమార్, న్యూరో ఫిజీషియన్ డాక్టర్ సుస్మిత, ఐసీయూ ఇంచార్జ్ డాక్టర్ అమిత్ పాషా. సూపరింటెండెంట్ డాక్టర్ జీ శ్రీనివాస్‌లతో కూడిన వైద్య బృందం.. కోటేశ్వరరావుకు ఇంకా ఎలా మెరుగైన చికిత్స ఇవ్వాలా? అని చర్చించింది. ఆయన కోమాలోకి వెళ్లాడు కాబట్టి, ఆయన బ్రెయిన్ పని చేస్తున్నదో లేదో కనుక్కోవలని అప్నియా పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. ఆరు గంటలకు ఒక సారి చొప్పున రెండు సార్లు ఆ టెస్టు చేశారు. ఈ రెండు టెస్టుల్లోనూ కోటేశ్వరరావు బ్రెయిన్ రెస్పాండ్ కాలేదు. దీంతో బుధవారం రాత్రి బ్రెయిన్ డెడ్‌గా వైద్యులు ప్రకటించారు.

బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలను ఇతరులకు దానం చేయవచ్చునని వైద్యులు.. కోటేశ్వరరావు కుటుంబానికి సూచించారు. వారు పెద్ద మనసుతో కోటేశ్వరరావు అవయవాలు దానం చేయడనికి అంగీకరించారు. ఇదే విషయాన్ని ఆస్పత్రి వర్గాలు జీవన్‌దాన్‌కు తెలిజేశాయి. ఈ నేపథ్యంలోనే చెన్నై, గుంటూరు, ఎన్ఆర్ఐ, అగర్వాల్ హాస్పిటల్‌ల నుంచి తమ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు అవయవాలు కావాలని వినతులు వచ్చాయి. వెంటనే వైద్యులు అవయవాలను అందించడానికి సిద్ధం అయ్యారు. గురువారం మధ్యాహ్నం వాటిని ఆయా హాస్పటిల్స్‌కు గ్రీన్ చానెల్ ద్వారా తరలించారు.

చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌కు గుండె, అపోలో ఆస్పత్రికి ఊపిరితిత్తులు, కామాక్షి ఆస్పత్రికి కాలేయాన్ని అందించారు. వీటిని పోలీసులు ఏర్పాటు చేసిన గ్రీన్ చానెల్ ద్వారా తరలించారు. ఎన్ఆర్ఐ హాస్పిటల్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి 33 కిలోమీటర్ల దూరాన్ని 25 నిమిషాల్లోనే అవయవాలను అంబులెన్స్‌లో తరలించారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో వీటిని చెన్నై తరలించారు. కోటేశ్వరరావు ఒక కిడ్నీని గుంటూరు రమేష్ ఆస్పత్రికి, మరో కిడ్నీని ఆయన అడ్మిట్ అయిన ఎన్ఆర్ఐ హాస్పిటల్‌లోనే చికిత్స పొందుతున్న ఓ పేషెంట్‌కు అందించారు. రెండు కళ్లను గుంటూరు అగర్వాల్ ఆస్పత్రికి అందించారు.