ఒంగోలు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్వేషణ ఎట్టకేలకు ఫలించింది. గత కొంతకాలంగా ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం సమన్వయ కర్త కోసం ఆ పార్టీ నోటీసు వేచి చూస్తోంది. గత కొంతకాలంగా దర్శి నియోజకవర్గానికి బలమైన అభ్యర్థి లేకపోవడంతో సమన్వయకర్త పదవి ఖాళీగానే ఉంది. 

ఆ నాటి నుంచి సరైన అభ్యర్థి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెతుకులాట ప్రారంభించింది. అలా వెతగ్గా వెతగ్గా ఓ బడా పారిశ్రామిక వేత్త తాను పోటీ చేసేందుకు సిద్ధమంటూ రెడీ అయ్యారు. తన మనసులో పార్టీలో చేరాలని అనుకున్న మరుక్షణమే హైదరాబాద్ లో లోటస్ పాండ్ లో పార్టీ అధినేత వైఎస్ జగన్ ను కలిశారు మద్దిశెట్టి వేణుగోపాల్. అధినేతకు తన మనసులో మాట చెప్పారు. 

ఎఫ్పటి నుంచో దర్శి నియోజకవర్గం సమన్వయ కర్త కోసం వేచి చూస్తున్న జగన్ వెంటనే వేణుగోపాల్ ను పార్టీలోకి ఆహ్వానించారు. వెంటనే రంగంలోకి దిగాలని సూచించారు. అయితే రోజులు బాగోలేక పోవడంతో సంక్రాంతి తర్వాత పార్టీలో చేరి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని హామీ ఇచ్చారట వేణుగోపాల్. 

మద్దిశెట్టి వేణుగోపాల్ 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున దర్శి నుంచి పోటీ చేశారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన 2019 ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని యోచిస్తున్నారు. 

వేణుగోపాల్ ను పార్టీలోకి తీసుకువచ్చేందుకు ఒంగోలు లోక్ సభ నియోజకవర్గ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి చక్రం తిప్పారని సమాచారం. దీంతో వేణుగోపాల్ తన సోదరుడు, ఒంగోలులోని పేస్‌ ఇంజనీరింగ్‌ కళాశాల నిర్వాహకుడు శ్రీధర్‌తో కలిసి హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌కు వెళ్లారు. 

తొలుత సజ్జల రామకృష్ణారెడ్డితో భేటీ అయ్యారు. ఆ తర్వాత పార్టీ అధినేత వైఎస్ జగన్‌ను కలిశారు. వెంటనే పార్టీ బాధ్యతలు చేపట్టి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని జగన్‌ సూచించినట్లు తెలుస్తోంది. అయితే జగన్ తో భేటీ సమయంలో వేణుగోపాల్ వెంట ప్రకాశం  జిల్లాలకు చెందిన నేతలు ఎవరూ లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.

బాలినేని శ్రీనివాస్ రెడ్డి కానీ, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వంటి వ్యక్తలు లేకుండా ఈయన తన సోదరుడితో వైఎస్ జగన్ ను కలవడం కలకలం రేపుతోంది. ఇకపోతే దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, మాజీ సమన్వకర్త బాదం మాధవరెడ్డిని వేణుగోపాల్ ఎలా కలుపుకుపోతారో అన్నది వేచి చూడాలి.