చేతులు కట్టేసి ఓ వ్యక్తికి ఉరివేసి మరీ దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన ఐడీఏ బొల్లారం పరిధిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా  మొలియాపుట్టి మండలం కొలిగం గ్రామానికి చెందిన దుప్పల వెంకట్ రావు(38) కిరాణ దుకాణం నిర్వహిస్తూ.. ఐడీఏ బొల్లారం సంతోష్ నగర్ లో ఉంటున్నారు.

సోమవారం రాత్రి ఇంటికెళ్లి భోజనం చేసి బయటకువెళ్లి అర్థరాత్రి ఒంటిగంటకు వచ్చారు. రాత్రి 2.30 గంటలకు దుకాణానికి వెళ్లి మళ్లీ రాలేదు. ఉదయం 8గంటలకు వెంకట్ రావు కుమారుడు షాపు వద్దకు వచ్చి చూడగా తండ్రి ఉరితాడుకు వేలాడుతూ కనిపించాడు. చేతులు వెనక్కి కట్టి ఉంటే ఉరి ఎలా వేసుకుంటాడనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించినట్లు భావిస్తున్నారు. వెంకట్ రావు ఫోన్ కనపడటం లేదని తెలుస్తోంది. జూదంలో గొడవల కారణంగా కానీ, పాతకక్షల నేపథ్యంలో కానీ హత్య జరిగి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. పటాన్ చెరు డీఎస్పీ భీమ్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వెంకట్ రావు భార్య విజయ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.