శ్రీకాకుళం: పుట్టిన ప్రతి మనిషి గిట్టక తప్పదు. ఇది ప్రకృతి ధర్మం. మనిషి పుట్టిన తర్వాత వారి ఆర్థిక స్థితిగతులను బట్టి ధనవంతుడుగా, పేదవాడిగా మధ్యతరగతి వాడిగా బతుకుతున్నాడు. 

మనిషి జీవన విధానంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నప్పటికీ శాశ్వతంగా విశ్రమించే శ్మశానంలో మాత్రం ఎలాంటి వ్యత్యాసం ఉండదు. కొందరు ఖననం చేస్తే మరికొందరు దహనం చేస్తారు ఇవే తేడాలు. 

బతికి ఉన్నప్పుడు ఎలాగూ సుఖపడలేదు చచ్చిన తర్వాత అయినా సుఖపడు అంటారు కానీ అలాంటి పరిస్థితి లేదు ప్రస్తుత తరుణంలో. రియల్ ఎస్టేట్ పెరిగిపోవడంతో అక్రమార్కులు స్మశాన వాటికలను సైతం కబ్జా చేసేస్తున్నారు. 

దీంతో ఆరడుగుల స్థలం కోసం నానా పాట్లు పడని పరిస్థితి నేటికి ఉందని చెప్పడం దురదృష్టకరం. స్మశాన వాటిక స్థలాన్ని కబ్జా చేయడంతో నడిరోడ్డుపైనే దహనం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. మానవీయ విలువలకు పాతరేసిన ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం కొండవూరులో చోటు చేసుకుంది. 

కొండవూరుకు చెందిన గుర్జు లక్ష్మణరావు అనారోగ్యంతో మృతి చెందాడు. మృతదేహానికి అంత్యక్రియలు చేయాల్సి వచ్చింది. అయితే స్మశాన వాటిక ఆక్రమణలు గురికావడంతో చేసేది లేక రజకులంతా రహదారిపైనే అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. 

కొండవూరులో సర్వే నెంబరు 413/4లో 4 సెంట్ల ప్రభుత్వ పోరంబోకు భూమి ఉంది. పూర్వం నుంచి ఆ భూమిని రజకులు రుద్ర భూమిగా వాడుకుంటున్నారు. కొంతమంది రైతులు ఆ స్థలాన్ని ఆక్రమించారు. కబ్జాకు గురవ్వడంతో రెవెన్యూ అధికారులకు రజకులంతా ఫిర్యాదు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదు. 

దీంతో ఆగ్రహం చెందిన రజకులు మృతదేహానికి రహదారిపైనే అంత్యక్రియలు నిర్వహించారు. ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా తెలియడంతో రెవెన్యూ అధికారులు దిగొచ్చారు. టెక్కలి ఆర్డీఓ భాస్కరరెడ్డి రంగంలోకి దిగారు. వజ్రపుకొత్తూరు తహసీల్దార్‌ జి.కల్పవల్లికి ఆదేశాలు జారీ చేశారు. 

తక్షణమే సర్వే చేపట్టి ఆక్రమణలు తొలగించి రజకుల దహన సంస్కారాలకు అవకాశం కల్పించాలని ఆదేశించారు. దీంతో వజ్రపుకొత్తూరు సర్వేయర్‌ కొండప్ప తిరుపతిరావు, వీఆర్‌ఓ తారకేశ్వరరావు, ఎస్‌ఐ పి.నరసింహమూర్తి తన సిబ్బందితో శ్మశాన వాటిక వద్దకు చేరుకొని రజకులతో మాట్లాడారు. 

సర్వే చేపట్టి ఆక్రమణల్లో ఉన్న మూడున్నర సెంట్లకు విముక్తి కలిగించారు. స్మశాన వాటికి స్థలం ప్రభుత్వానిది అని దానిని ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలుు తీసుకుంటామని పోలీసులు కబ్జాదారులకు హెచ్చరించారు.