విజయవాడ: ఏపీ ఎన్నికల కమిషనర్ తొలగింపు వ్యవహారంపై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఎన్నికల కమిషనర్ నియామకం విషయంలో నిబంధనలు మారుస్తూ వైసిపి ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ ను కొట్టి పారేసింది. వెంటనే నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ని  కమిషనర్ గా నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ సంచలన తీర్పుపై టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ట్విట్టర్ వేదికన స్పందించారు. 

''హై కోర్టు తీర్పు నియంతపాలన కి చెంపపెట్టు. కరోనా నేపథ్యంలో ప్రజల శ్రేయస్సు కోరి ఎన్నికలు వాయిదా వేసిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ గారికి న్యాయం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వ ఆలోచనా ధోరణిలో మార్పువస్తుంది అని ఆశిస్తున్నా'' అన్నారు. 

read more  ఏపీ హైకోర్టు సంచలన తీర్పు: ఏపీ ఎస్ఈసీగా కనగరాజ్ ఔట్, నిమ్మగడ్డ ఇన్

''మీకు అధికారం కట్టబెట్టింది అభివృద్ధి చేస్తారని, అరాచకం సృష్టిస్తారని కాదు. మేమింతే అంటే మరోసారి జగన్ గారు, విజయసాయి రెడ్డి గారు జైలుకి వెళ్లడం ఖాయం'' అంటూ వెంకన్న సంచలన ట్వీట్ చేశారు. 

టిడిపి ఎంపీ కేశినేని కూడా హైకోర్టు తీర్పుపై స్పందించారు. ''న్యాయం గెలిచింది చట్టం గెలిచింది ప్రజాస్వామ్యం గెలిచింది రాజ్యాంగం గెలిచింది న్యాయ వ్యవస్థ పై వున్న నమ్మకం నిలబడింది'' అని ట్వీట్ చేశారు.

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌కుమార్ కొనసాగించాలని ఏపీ హైకోర్టు ఆదేశించడంతో  కొత్తగా నియమితులైన కనగరాజ్ ఈ బాధ్యతల నుండి తప్పుకోవాల్సిన పరిస్థితులు అనివార్యంగా మారింది.

 ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను  ప్రభుత్వం తిరిగి నియమించాలని కూడ హైకోర్టు ఆదేశించింది.హైకోర్టు ఆదేశాలను నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్వాగతించారు. హైకోర్టు ఆదేశాల మేరకు తాను విధుల్లో చేరుతానని ఆయన శుక్రవారం నాడు ప్రకటించారు.

ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగించేందుకు ఏపీ ప్రభుత్వం ఎన్నికల సంఘం నియమ నిబంధనల్లో మార్పులు చేర్పులు తెచ్చింది. సంస్కరణల్లో భాగంగా మార్పులు తెచ్చినట్టుగా ఏపీ ప్రభుత్వం చెప్పింది. సంస్కరణల పేరుతో రమేష్ కుమార్ ను తొలగించేందుకు ఆర్డినెన్స్ తెచ్చిందని ఏపీ ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి.

read more  విధుల్లో చేరుతా: హైకోర్టు తీర్పుపై నిమ్మగడ్డ రమేష్ కుమార్

కొత్త ఎన్నికల కమిషనర్ కనగరాజ్ నియామకం చెల్లదని కూడ హైకోర్టు తీర్పు చెప్పింది.ఎస్ఈసీ నిబంధనలను మార్చడాన్ని కూడ హైకోర్టు తప్పుబట్టింది. తనను ఎన్నికల సంఘం కమిషనర్ పదవి  నుండి తప్పించడాన్ని సవాల్ చేస్తూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో పాటు మరో 13 పిటిషన్లు దాఖలయ్యాయి.

 ఈ పిటిషన్లపై విచారణ చేసిన హైకోర్టు ఇవాళ సంచలన తీర్పును ఇచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ 11వ తేదీని కనగరాజ్ ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.