Asianet News TeluguAsianet News Telugu

14రోజుల నా మనవరాలితో సహా... కుటుంబంలో 11మందికి కరోనా: సీఎంకు టిడిపి ఎమ్మెల్సీ లేఖ

రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి జగన్ కు ఎమ్మెల్సీ వెంకన్న ఓ బహిరంగ లేఖ రాశారు. 

budda venkanna open letter to AP CM YS Jagan
Author
Guntur, First Published Sep 6, 2020, 11:36 AM IST

గుంటూరు: తనలాంటి ప్రజాప్రతినిధులే కరోనా బారిన పడి రాష్ట్రంలో వైద్యం పొందేందుకు నానా ఇబ్బందులు పడాల్సి వచ్చిందని టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. ఎమ్మెల్సీ అయిన తన పరిస్థితే ఇలా వుంటే ఇక సామాన్యుల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. కాబట్టి రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి జగన్ కు వెంకన్న ఓ బహిరంగ లేఖ రాశారు. 

సీఎంకు వెంకన్న రాసిన బహిరంగ లేఖ యధావిధిగా: 

వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారికి,

నమస్కారములు.

విషయం: రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలి – ఖాళీగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, కళాశాలలు, కళ్యాణ మండపాల్లో క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేయాలి – కరోనా బాధితులకు రూ.2వేలు కొనసాగించాలి – అన్న క్యాంటీన్లను తెరిచి వృద్ధులకు పౌష్టికాహారం అందించాలి. 

రాష్ట్రంలో అత్యంత విచారకరమైన పరిస్థితులు నెలకొన్న విషయాన్ని ఈ లేఖ ద్వారా మీ దృష్టికి తీసుకువస్తున్నాను. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ నెలకొంది. నా కుటుంబంలో 11 మంది కరోనా భారిన పడి కోలుకున్నారు. అందులో 14 రోజుల వయస్సున్న నా మనమరాలు కరోనా భారిన పడి కోలుతుంది. ఆ వైరస్ నా ఇంటిని, ఒంటిని గుళ్ల చేసింది. శాసన మండలి సభ్యుడిగాను, ప్రజా ప్రతినిధిగా ఉన్న నాకే వైరస్ సోకితే వైద్యం చేయించుకోవడానికి అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తే మరి సామన్యుల పరిస్థితి ఏమిటి? వాళ్లు సామాజికంగా, ఆర్ధికంగా, శారీరకంగా చితికిపోవాల్సిందేనా? ప్రభుత్వం వారిని ఆదుకోవడంలో ఎందుకు చిన్నచూపు చూస్తున్నారు. సామాన్యడికి కరోనా సోకితే కాటికి కాళ్లు చాపినట్లే భావించాలా? ప్రతిపక్ష పార్టీల నాయకులను వేధించడం మీద చూపిన శ్రద్ధ కరోనా బాధితుల మీద చూపించడం లేదు. అన్న క్యాంటీన్లు తెరిచి పౌష్టికాహారం అందించి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలి.

ఒక వైపు కరోనా కిట్లు అందించమని ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉన్న డాక్టర్లు, నర్సులు ఆందోళనలు చేస్తుంటే మరో వైపు ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, క్వారంటైన్ సెంటర్లలో భోజన సదుపాయాలు మెరుగుపర్చమని ప్రజలు రోడ్లెక్కారు.  కరోనాతో పోరాటం చేస్తున్న డాక్టర్లు, నర్సులకు పక్క రాష్ట్రాల్లో పూల వర్షం కురిపిస్తుంటే మీరు మాత్రం ప్రశ్నించిన వారిపై దెబ్బల వర్షం కురిపించారు.  

కోవిడ్ -19 వైరస్ అంటే ప్రపంచ వ్యాప్తంగా భయబ్రాంతులు చెందుతుంటే మీరు మాత్రం బ్లీచింగ్ పౌడర్, పారాసిట్మాల్ మందులతో పోగొట్టవచ్చని చెప్పడంతో ప్రజలు తేలిగ్గా తీసుకోవడంతో పెద్ద ఎత్తున మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకు నిదర్శనంగా  కరోనా కేసుల్లో దేశంలో మన రాష్ట్రం రెండో స్థానంలోను, మరణాల్లో 4వ స్థానంలో ఉంది. 

సెప్టెంబర్ 5 వరకు ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 4,76,506 కాగా, ఆగస్టు నెలలో 2,92,035 కేసులు నమోదు అయ్యాయి. ప్రతి రోజు క్రమం తప్పకుండా 10వేల కేసులు భయటపడుతున్నాయి. ఇప్పటి వరకు 4,276 మంది చనిపోయారు.  ఒక్క ఆగస్టు నెలలోనే 2,600 మంది చనిపోయారు. ఈ విధంగా కేసులు భయటపడుతుంటే ఆంధ్రప్రదేశ్ కేసుల సంఖ్యలో ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానానికి వెలుతుంది. భవిష్యత్ లో పరిస్థితిని ఊహించుకుంటే భయానకంగా ఉంది. కాబట్టి ప్రభుత్వం హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలి.

కరోనా బాధితుల కోసం ఖాళీగా ప్రభుత్వ భవనాలు, కార్యాలయాలు, కళ్యాణ మండపాలు, స్టేడియంలు క్వారంటైన్ సెంటర్లుగా మార్చి ప్రజల ప్రాణాలను కాపాడాలి. ప్రాణాలు కోల్పోయిన ఫ్రంట్ లైన్ వారియర్స్ పోలీసులు, డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు, జర్నలిస్టుల కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం అందించాలి. వారి భద్రతపై ప్రభుత్వం శద్ధ చూపాలి. ఆసుపత్రులలో మౌలిక సదుపాయాలు మెరుగుపర్చాలి. క్వారంటైన్ సెంటర్లలో విద్యుత్, తాగునీరు, ఆహారం, వైద్యం, పారిశుద్ధ్యం తదితర సదుపాయాలను కల్పించాలి. కరోనా బాధితులకు రూ.2వేలు కొనసాగించాలి. 

లాక్ డౌన్ అనంతరం ఉపాధి, ఉద్యోగం, వ్యాపార అవసరాల రిత్య ఇళ్లల్లో నుంచి భయటకు వెలుతున్న వారికి రక్షణ, అప్రమత్తం బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రజలు ఇంతటి ఆపదలో ఉంటే.. ఇదే అదునుగా సంస్కరణల పేరుతో నిస్సిగ్గుగా పన్నులు, చార్జీలు పెంచటం వంచన కాదా? ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన పాలకులు అన్ని విధాల చేతులెత్తేసి నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు మెరుగుపరచి మండల స్థాయిలోనూ కరోనా వైద్య పరీక్షలు, వైద్యం ఉచితంగా చేయాలి. ప్రజల ప్రాణాలను కాపాడాలి. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి.

బుద్దా వెంకన్న,
శాసనమండలి సభ్యులు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios