అమెరికాలో తెలుగు విద్యార్థి దారుణ హత్య..
ఏలూరుకు చెందిన ఓ విద్యార్థి అమెరికాలో జరిగిన కాల్పుల్లో మృతి చెందాడు. ఉన్నత చదువులకోసం వెళ్లి.. మృత్యువాత పడ్డాడు.
ఓహియో : అమెరికాలో చదువుకోవడానికి వెళ్లిన ఓ తెలుగు విద్యార్థి దారుణంగా హత్య చేయబడ్డాడు. ఆ విద్యార్థి పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన వీర సాయేష్ గా గుర్తించారు. సాయేష్ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళాడు. అక్కడ చదువుకుంటూనే పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. సాయేష్ కొలంబస్ ఫ్రాంక్లింటన్ లోని ఓ షెల్ గ్యాస్ స్టేషన్లో పనిచేస్తున్నాడు. ఓహియో స్టేట్ పిన్స్ యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుకుంటున్నాడు.
రోజులాగే గురువారం మధ్యాహ్నం.. అంటే ఓహియో కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి 12.50గం.లకు సాయేష్ యధావిధిగా గ్యాస్ స్టేషన్లో పనిచేస్తున్నాడు. అక్కడికి వచ్చిన ఇద్దరు దుండగులు.. సాయేష్ మీద కాల్పులు జరిపారు. గ్యాస్ స్టేషన్లో ఉన్న నగదు తీసుకుని పారిపోయారు. ఈ కాల్పుల్లో సాయేష్ కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గమనించిన మిగతావారు అతడిని ఓహియో హెల్త్ గ్రాంట్ మెడికల్ సెంటర్ కు తరలించారు. సాయేష్ కు అక్కడ వైద్యులు చికిత్స మొదలుపెట్టారు.. చికిత్స తీసుకుంటూనే సాయేష్ మరణించాడు.
తెలంగాణ సీఎం ట్రాప్ లో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ - బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్‌రెడ్డి
సాయేష్ కు తండ్రి లేడు. నాలుగేళ్ల క్రితం మృతి చెందాడు. తల్లి ప్రస్తుతం ఏలూరులో ఉంటుంది. గురువారం రాత్రి 8 గంటలకు సాయేష్ మృతికి సంబంధించిన సమాచారం.. అందిందని కుటుంబ సభ్యులు తెలిపారు. సాయేష్ తండ్రి వీరా రమణ పాలకొల్లు నివాసి. నాలుగేళ్ల క్రితం అతను మృతి చెందాడు. సాయేష్ వీరికి చిన్న కొడుకు. ఉన్నత చదువుల కోసం రెండేళ్ల క్రితం అమెరికాకు వెళ్ళాడు. అక్కడి ఓహియో స్టేట్ పిన్స్ యూనివర్సిటీలో చదువుకుంటూ.. పార్ట్ టైం జాబ్ చేస్తూన్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితులను ఇప్పుడిప్పుడే చక్కబెడుతున్నాడు. ప్రస్తుతం ఎమ్మెస్ లాస్ట్ సెమిస్టర్ జరుగుతుంది. మరో పది రోజుల్లో అతని చదువు పూర్తవుతుంది. ఈ సమయంలో కొడుకు ఇలా దుర్మరణం పాలవడంతో ఆ తల్లి కన్నీటిని ఆపలేకపోతున్నారు.