విశాఖలో ఘోర ప్రమాదం: కుప్పకూలిన బ్రిడ్జ్, నుజ్జునుజ్జయిన కార్లు.. ఇద్దరి మృతి
విశాఖపట్నం జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అనకాపల్లిలోని జాతీయ రహదారిపై నిర్మాణంలో వున్న బ్రిడ్జ్ పిల్లర్ కూలి వాహనాలపై పడింది. ఈ ఘటనలో రెండు కార్లు ధ్వంసమవ్వగా.. కారులో ఇద్దరు ప్రయాణికులు వున్నట్లుగా తెలుస్తోంది.
విశాఖ జిల్లాలోని అనకాపల్లి వద్ద మంగళవారం జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న వంతెన సైడ్ పిల్లర్ కూలి రహదారిపై వెళ్తున్న వాహనాలపై పడింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఓ కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో ప్రయాణికులు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బ్రిడ్జి పిల్లర్లు పెద్ద శబ్ధంతో కూలడంతో జనం పరుగులు తీశారు. కూలిన బ్రిడ్జి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బ్రిడ్జి కింద ఇంకెవరైనా చిక్కుకున్నారేమోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఇతర అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
కాగా, గడిచిన రెండేళ్లుగా ఈ రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి. దీనిలో భాగంగానే అనకాపల్లి వై జంక్షన్ వద్ద బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలో వంతెన సైడ్ పిల్లర్ ఒక్కసారిగా కూలిపోవడంతో బ్రిడ్జి నిర్మాణంలో నాణ్యతపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదం సంభవించడంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
"