విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఇటీవల కాకినాడలో జరిగిన కాపు నేతల సమావేశం అనంతరం నియోజకవర్గంలో చోటుచేసుకుంటున్న పరిణామాలతో ఆయన తీవ్ర ఆవేదనలో ఉన్నారు. తన మీద ఆ మాత్రం నమ్మకం కూడా లేదా అని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  విషయం తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు బొండా ఉమాతో ఫోన్లో మాట్లాడి బుజ్జగించినట్లు సమాచారం.

ఇంతకీ మ్యాటరేంటంటే... ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన 25 ఓట్ల స్వల్ప తేడాతో వైసీపీ అభ్యర్థి మల్లాది విష్ణుపై ఓటమి చెందారు. ఇదిలా ఉంటే ఇటీవల కాపు నేతల సమావేశం కాకినాడలో జరిగింది. తోట త్రిమూర్తులు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు కాపు నేతలు పాల్గొన్నారు. వారంతా పార్టీ మారేందుకే సమావేశమయ్యారనే ప్రచారం ఊపందుకుంది. దీనిని ఆ నేతలందరూ ఖండించినా.. ప్రచారం మాత్రం ఆగలేదు.

ఈ విషయంపై ఇప్పటికే బొండా ఉమ... చంద్రబాబుతో మాట్లాడారు. తాను పార్టీ మారడం లేదని.. తనకు ఆ ఉద్దేశ్యం లేదని కూడా చెప్పారు. అయినా.. రూమర్స్ ఆగకపోవడం గమనార్హం.  అంతేకాకుండా రాష్ట్ర కార్యాలయం నుంచి నియోజకవర్గంలోని నేతలకు ఫోన్స్ వస్తున్నాయట. బొండా ఉమా పార్టీ మారితే.. ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే విషయంపై ఆరా మొదలుపెట్టారట. ఈ విషయం తెలిసిన ఉమా బాగా హర్ట్ అయ్యారు. తన మీద ఆమాత్రం కూడా నమ్మం లేదా అని అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ సంగతి చంద్రబాబు దాకా వెళ్లడంతో..ఆయన బుజ్జగించినట్లు తెలుస్తోంది.