బొజ్జలను పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరాలంటూ కొందరు ఒత్తడి తెస్తున్నారు. 15వ తేదీ తర్వాత ఏదో ఒక నిర్ణయం తీసుకోవటమైతే ఖాయం. చూద్దాం ఏం చేస్తారో? ఒకవేళ బొజ్జల గనుక టిడిపికి రాజీనామా చేసినా లేక వైసీపీలో చేరినా చంద్రబాబుకు ఇబ్బందే.

మాజీమంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి టిడిపికి త్వరలో షాక్ ఇవ్వనున్నారా? పొలిటికల్ సర్కిల్స్ లో ఇదే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అనారోగ్యం కారణంగా చూపి చంద్రబాబునాయుడు తనను మంత్రివర్గం నుండి తొలగించటాన్ని బొజ్జల అవమానంగా భావిస్తున్నారు. మంత్రిపదవికి పనికిరాని తాను ఎంఎల్ఏగా మాత్రం ఎలా పనికొస్తానంటూ ఎంఎల్ఏ పదవికి కూడా రాజీనామా చేసారు. దాంతో చంద్రబాబు షాక్ తిన్నారు. మంత్రివర్గ విస్తరణ జరిగినప్పటి నుండి ఇప్పటి వరకూ బొజ్జల సిఎంతో మాట్లాడలేదు. ఆగ్రహంతో ఉన్న బొజ్జలను సముదాయించమని చంద్రబాబు ఇద్దరు దూతలను పంపినా ఉపయోగం కనబడలేదు.

ఎంత ప్రయత్నించినా బొజ్జల దారికి రాకపోవటం పట్ల సిఎం కూడా ఆగ్రహంతో ఉన్నారు. అదే సమయంలో బొజ్జల త్వరలో పార్టీ మారిపోతారంటూ చిత్తూరు జిల్లాతో పాటు టిడిపిలో కూడా ప్రచారం ఊపందుకున్నది. ఒకవేళ జరుగుతున్న ప్రచారమే నిజమైతే చంద్రబాబుకు బాగా ఇబ్బందే. ఎందుకంటే, 1994 ఎన్టీఆర్ ను వెన్నుపోటుతో చంద్రబాబు సిఎంగా దింపేసినపుడు పక్కనున్న అతికొద్ది మంది సన్నిహితుల్లో బొజ్జల కూడా ఒకరు. అదే విధంగా 2003లో అలిపిరిలో చంద్రబాబుపై మావోయిస్టులు దాడి చేసినపుడు గాయపడ్డ వాళ్ళల్లో బొజ్జల కూడా ఉన్నారు.

పార్టీలో ఏ సమస్య వచ్చినా బొజ్జలను చంద్రబాబు బాగా వాడుకున్నారు. అంతెందుకు, మొన్నటికి మొన్న చంద్రబాబు ఇరుకున్న ఓటుకునోటు కేసులో నుండి కూడా బొజ్జలే బయటపడేసారని ప్రచారం. ఎలాగంటే, తెలంగాణా సిఎం కెసిఆర్ బొజ్జల బాగా సన్నిహితులు. ఆ సన్నిహితంతోనే బొజ్జల తెలంగాణా సిఎంపై ఒత్తిడి తెచ్చి చంద్రాబాబును తాత్కాలికంగానైనా కాపాడారన్నది కాదనలేని సత్యం. అటువంటిది తనను ప్రతీ అవసరానికి వాడుకుని అనారోగ్యంతో ఉన్నపుడు అవమానిస్తారా అంటూ బొజ్జల బాగా ఆగ్రహంతో ఉన్నారు.

ఈనెల 15వ తేదీన నియోజకవర్గంలోను, పార్టీలోని తన మద్దతుదారులతో బొజ్జల సమావేశమవుతున్నారు. పార్టీలో ఉండాలా రాజీనామా చేయాలా అన్న విషయమై సమావేశం జరుపుతున్నారు. అయితే, బొజ్జలను పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరాలంటూ కొందరు ఒత్తడి తెస్తున్నారు. 15వ తేదీ తర్వాత ఏదో ఒక నిర్ణయం తీసుకోవటమైతే ఖాయం. చూద్దాం ఏం చేస్తారో? ఒకవేళ బొజ్జల గనుక టిడిపికి రాజీనామా చేసినా లేక వైసీపీలో చేరినా చంద్రబాబుకు ఇబ్బందే.