హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొక్కాకు ఉన్న రక్తం, దాడి చేయడానికి శ్రీనివాస రావు వాడిన కత్తికి అంటిన రక్తం ఒక్కటేనని పరీక్షలో తేలింది. తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ పోలీసులకు నివేదికను సమర్పించింది. 

డిఎన్ ఫింగర్ ప్రింటింగ్, సీరోలాజికల్ పరీక్షల వివరాలు కూడా ఆ నివేదికలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. నిరుడు అక్టోబర్ 25వ తేదీన జగన్ మీద శ్రీనివాస రావు అనే యువకుడు దాడి చేసిన విషయం తెలిసిందే. 

అయితే, ఎఫ్ఎస్ఎల్ పంపించిన నివేదిక తమకు ఇంకా అందలేదని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అంటున్నారు. డిఎన్ఎ ఫింగర్ ప్రింటింగ్ పరీక్షలు విజయవాడలో చేయించాలని తొలుత పోలీసులు భావించారు. అయితే లాజిస్టిక్స్ ను దృష్టిలో ఉంచుకుని హైదరాబాదులో చేయించారు. 

కత్తి, జగన్ చొక్కా, గాయానికి చికిత్స చేయడానికి వాడిన కాటన్ ల నుంచి సేకరించిన డిఎన్ఎను తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ  నిపుణులు విశ్లేషించారు.