వైఎస్ షర్మిలకు చెక్ పెట్టబోతున్నారా?
ఆంధ్ర ప్రదేశ్ లో వైఎస్ షర్మిల నియామకంతో దూకుడు పెంచిన కాంగ్రెస్ లోక్సభలో కూడా ఈ అంశాలపై చర్చలేవనెత్తుతోంది. ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాకూర్ తాజాగా లోక్సభలో విభజన హామీల మీద వాయిదా తీర్మానం ఇచ్చారు.
అమరావతి : వైయస్ షర్మిల.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అటు అధికార వైసిపిని రకరకాలుగా ఇబ్బంది పెడుతూ.. ఇటు మిగతా ప్రతిపక్షాలకూ చెక్ పెడుతోంది. అధికార వైసీపీని ఇరకాటంలో పెట్టేలా మాట్లాడుతూ తీవ్రదుమారం రేపుతోంది. ఈ క్రమంలోనే షర్మిలకు చెక్ పెట్టేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బిజెపికి సూచనలందినట్టు తెలుస్తోంది. దీనికి ముఖ్య కారణం ‘ప్రత్యేక హోదా’.
రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ కు ‘ప్రత్యేక హోదా’ దక్కుతుందని ఆశించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ కూడా ప్రత్యేక హోదా సాధన కోసం ప్రయత్నిస్తామని హామీలు ఇచ్చింది. అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో ఈ ప్రత్యేక హోదా అంశం పెద్దగా చర్చకు రాలేదు. తాజాగా, ఏపీ కాంగ్రెస్ చీఫ్ బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల మాత్రం ఈ ప్రత్యేక హోదా అంశాన్ని మరోసారి తెరమీదకి తీసుకొచ్చారు.
ఈ అంశంపై ఆమె ఇటు వైసిపి ప్రభుత్వాన్ని, అటు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. వైసిపి అధినేత, ముఖ్యమంత్రి, తన అన్న అయిన వైయస్ జగన్ ను ఉద్దేశించి..‘హోదా విషయంలో కేంద్రం మెడలు పంచుతామని చెప్పారు. కానీ ఇప్పటివరకు హోదా తీసుకురాలేదు’ అంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
మూడు ప్రాంతాల ప్రజలు ఫ్యాన్ రెక్కలు విరగ్గొట్టాలి: చంద్రబాబు
మరోవైపు.. ఆంధ్ర ప్రదేశ్ లో వైఎస్ షర్మిల నియామకంతో దూకుడు పెంచిన కాంగ్రెస్ లోక్సభలో కూడా ఈ అంశాలపై చర్చలేవనెత్తుతోంది. ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాకూర్ తాజాగా లోక్సభలో విభజన హామీల మీద వాయిదా తీర్మానం ఇచ్చారు. దీంతో, మింగుడు పడని బిజెపి పెద్దలు వైసిపి ముఖ్య ఎంపీ ఒకరితో మాట్లాడినట్టు సమాచారం. ఆయనను పిలిచి ఇదేంటని ప్రశ్నించారట.
ఈ క్రమంలోనే షర్మిల అంశం ప్రస్తావనకు వచ్చిందని తెలుస్తోంది. ఆ సమయంలో ఆ ఎంపీ బిజెపి పెద్దలతో..‘‘ వైఎస్ షర్మిల కావాలనే ప్రత్యేక హోదా అంశాన్ని తీసుకొస్తున్నారు. దాన్ని మేము సమర్థవంతంగా ఎదురు దాడి చేస్తున్నాం. కానీ మీ పార్టీ నుంచి ఎవరూ మాట్లాడటం లేదు. అలాగే జరిగితే ఎన్నికల్లో తీవ్ర నష్టం వస్తుంది’ అన్నట్లుగా సమాచారం. దీంతో ఢిల్లీ బిజెపి పెద్దలు షర్మిల మీద ఎదురు దాడి చేయాలని ఏపీ బీజేపీ నేతలకు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఇకపై.. షర్మిలపై ఒక వైసీపీ నేతలే కాదు.. బిజెపి నేతలు కూడా ఎదురుదాడికి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.