మూడు ప్రాంతాల ప్రజలు ఫ్యాన్ రెక్కలు విరగ్గొట్టాలి: చంద్రబాబు
జగన్ టికెట్లు ఇస్తున్నా పోటీకి అభ్యర్థులు లేరని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు విమర్శించారు.
మాడుగుల: రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజలు ఫ్యానుకు ఉన్న 3 రెక్కలను ముక్కలుగా విరగొట్టాలని చంద్రబాబు కోరారు.బాదుడే బాదుడు అనే రెక్కను పీకడానికి కోస్తా ప్రజలు, హింస, దోపిడీ రెక్కను తుక్కుతుక్కు చేయడానికి రాయలసీమ ప్రజలు, మొండి ఫ్యానును జగన్ చేతికి ఇచ్చి వైసీపీని బంగాళాఖాతంలో విసిరేయడానికి రాష్ట్ర ప్రజలంతా సిద్ధం కావాలని చంద్రబాబు కోరారు.
అనకాపల్లి జిల్లా మాడుగుల, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని చింతలపూడిలో సోమవారం రా..కదలిరా బహిరంగ సభల్లో చంద్రబాబు నాయుడు ప్రసంగించారు.ఎన్నికలకు సిద్ధం అని జగన్ తన సభల్లో అంటున్నారు..కానీ ఓటమి భయంతో పూర్తిగా సందిగ్ధంలో ఉన్నాడని తెలుగు దేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. జగన్ టికెట్లు ఇస్తున్నా పోటీకి అభ్యర్థులు దొరకడం లేదని ఆయన ఎద్దేవా చేశారు.
జగన్ బటన్ నొక్కడం వల్లే 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెరిగాయన్నారు. జాబ్ కేలండర్ కు జగన్ ఎందుకు బటన్ నొక్కలేదో సమాధానం చెప్పాలని ఆయన కోరారు.మద్య నిషేధం,సీఎఎస్ రద్దు హామీలకు బటన్ ఎందుకు నొక్కలేదో చెప్పాలన్నారు.వచ్చే ఎన్నికల్లో ఓటుతో ప్రజలు నొక్కే బటన్ తో జగన్ ఇంటికెళ్లడం ఖాయమని చంద్రబాబు చెప్పారు. రానున్న ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధించి ప్రజల ప్రభుత్వాన్ని స్థాపిస్తామన్నారు.
ఈ తుఫానులో వైసీపీ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయమని చంద్రబాబు ధీమాను వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి 124సార్లు బటన్ నొక్కానని గొప్పగా చెబుతున్నాడు. బటన్ నొక్కుడు కాదు.... దాని చాటున నీ బొక్కుడు ఎంతో చెప్పు అని ఆయన ప్రశ్నించారు.జగన్ బటన్ నొక్కడం వల్ల తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెరగడంతో పేదవాళ్లు నష్టపోయారన్నారు.
తమ పాలనలో ఒక్కసారి కూడా కరెంటు ఛార్జీలు పెంచని విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. జగన్ పాలనలో ఒక్కో కుటుంబంపై రూ.8లక్షల అప్పు పెరిగిందని ఆయన ఆరోపించారు.ధనదాహంతో ఉత్తరాంధ్రను ఊడ్చేశాడని చంద్రబాబు సీఎం పై ఆరోపణలు చేశారు.
2019లో టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే విశాఖ రైల్వే జోన్ ఇప్పటికే పూర్తయ్యేదని చెప్పారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేసే పరిస్థితి వస్తే జగన్ రెడ్డి కనీసం ఒక్క మాట మాట్లాడలేదని చంద్రబాబు విమర్శించారు.టీడీపీ పాలనలో ఇలాంటి పరిస్థితి వస్తే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి డబ్బులిచ్చి ముందుకు నడిపించాం తప్ప ప్రైవేటీకరణ కానివ్వలేదన్నారు.
జగన్ రెడ్డి వై నాట్ 175 అంటున్నాడు...కానీ మేం అంటున్నాం...వై నాట్ పులివెందుల అని చంద్రబాబు చెప్పారు. జగన్ రెడ్డికి అభ్యర్థులు దొరకడం లేదుని ఆయన ఎద్దేవా చేశారు. 6లిస్టుల ద్వారా 85మందిని మార్చాడన్నారు. కొంత మంది జగన్ రెడ్డి ఆదేశాలను చెత్తబుట్టల్లో వేసిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు.
జగన్ రెడ్డి సిద్ధం పేరుతో రాష్ట్ర ప్రజలను సందిగ్ధంలో పడిపోయాడు. జగన్ రెడ్డికి అధికారం పిచ్చోడి చేతిలో రాయిలా వాడుతున్నాడన్నారు. జగన్ రెడ్డిని ఓడించడానికి నిరుద్యోగులు, మహిళలు, రైతులు, పేదవాళ్లు, ఎస్సీ, బీసీ, మైనారిటీలు స్టార్ క్యాంపెయినర్లుగా మారాలని చంద్రబాబు కోరారు.