చెప్పినట్లుగానే చంద్రబాబునాయుడుపై బిజెపి స్వరం పెంచుతోంది. ఇంతకాలం ప్రభుత్వ విధానాలు, అవినీతిపై పైపైన మాత్రమే ఆరోపణలు చేస్తున్న బిజెపి నేతలు మొదటిసారిగా చంద్రబాబును వెన్నుపోటుదారునిగా అబివర్ణించారు. వీళ్ళ వరస చూస్తుంటే ముందు ముందు ఇంకెంత స్ధాయిలో విరుచుకుపడనున్నారో అర్దమైపోతోంది.

సోమవారం ఢిల్లీలో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపి ఇన్చార్జి రామ్ మాధవ్ మాట్లాడుతూ, చంద్రబాబును వెన్నుపోటుదారునిగా ఆరోపించారు. సొంతమామనే వెన్నుపోటు పొడిచారంటూ దెప్పిపొడిచారు. చంద్రబాబుకు తెలిసినన్ని జిమ్మిక్కులు ఎవరికీ తెలియవని ఎద్దేవా చేశారు. రాజకీయ లబ్ది కోసమే ఎన్డీయే నుంచి టీడీపీ వైదొలిగిందని, ఏపీలో టీడీపీ పొలిటికల్‌ గేమ్‌ ఆడుతుందన్నారు.

పొలిటికల్‌ గేమ్స్‌లో ఎవరూ చంద్రబాబును బీట్‌ చేయలేరని విమర్శించారు. చంద్రబాబు తన వైఫల్యాలను తమపై నెట్టాలని చూస్తున్నారని, కానీ తాము అలా జరగనివ్వమని గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు.  ఇప్పటికే  రాష్ట్రానికి చాలా సాయం చేశామని, భవిష్యత్తులోనూ మరింత చేస్తామని హామీ ఇచ్చారు.

వెన్నుపోటు రాజకీయాల్లో చంద్రబాబు సిద్ధహస్తులన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. సొంతమామకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు అధికారం కోసం ఎంతకైనా దిగజారుతారని మండిపడ్డారు. అవిశ్వాస తీర్మానం గురించి తాము భయపడేది లేదని, తమకు పార్లమెంట్‌లో సరిపడ సభ్యులున్నారని చెప్పారు. టీడీపీ వైఖరి కేవలం రాజకీయమేనని, ప్రజల భావోద్వేగాలకు సంబంధించిన అంశాన్ని అకస్మాత్తుగా తెరపైకి తీసుకురావడంపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.