గుంటూరు: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. ఈవీఎంలపై చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే పలు అనుమానాలకు తావిస్తోందని విమర్శించారు. 

గుంటూరులో మీడియాతో మాట్లాడిన కన్నా చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు తనకు అనుకూలంగా ఉండే కలెక్టర్లను పెట్టుకుని ఎన్నికలను మేనేజ్ చేస్తున్నారంటూ ఆరోపించారు. వాటిని ఎదుటివారిపై రుద్దుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు తన రివ్యూలలో కలెక్టర్లను పొగడటం చూస్తుంటే డౌట్ వస్తుందన్నారు. 

2014 ఎన్నికలు, నంద్యాల ఉపఎన్నికల్లో చంద్రబాబు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులపై ఎన్నికల కమిషన్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు పూటకోమాట మాట్లాడుతున్నారని విమర్శించారు. 

కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ని సోనియాగాంధీ అద్భుతంగా విభజించారని చెప్పిన విిషయాన్ని గుర్తు చేశారు. కానీ ఏపీలో మాత్రం బీజేపీ అన్యాయం చేసిందని మాట్లాడతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

సోనియాగాంధీ ఏపీని బాగా విభజించిందన్నందుకు ఆంధ్రప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నిత్యం అబద్దాలడే వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం సిగ్గుచేటన్నారు. మరోవైపు ఎన్నికల నిర్వహణలో ఈసీ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. 

ఇటీవల జరిగిన ఎన్నికల్లో మద్యం, డబ్బు విచ్చలవిడిగా పంపిణీ చేశారని ఆరోపించారు. దానిపై విచారణ జరపాలని కోరితే ఇంతవరకు స్పందించలేదన్నారు. ఎన్నికల్లో రూ.50 కోట్లు ఖర్చుపెట్టామని చెప్తున్న టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని సిఈవో గోపాలకృష్ణ ద్వివేదిని డిమాండ్ చేశారు కన్నా లక్ష్మీనారాయణ.