Asianet News TeluguAsianet News Telugu

జవాబు చెప్పాల్సిందే: చంద్రబాబుకు బిజెపి పది ప్రశ్నలు

బిజెపి నాయకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి పది ప్రశ్నలు సంధించారు. చంద్రబాబుపై తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేశారు. 

BJP poses 10 questions to Chandrababu

తిరుపతి: కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేసిందంటూ సోమవారం తిరుపతిలో సభ నిర్వహించనున్న నేపథ్యంలో బిజెపి నాయకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి పది ప్రశ్నలు సంధించారు. చంద్రబాబుపై తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేశారు. 

మోసపూరితమైన హమీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టిన చంద్రాబబు ఇప్పుడు కేంద్రంపై విరుచుకుపడడం విడ్డూరంగా ఉందని అన్నారు. సత్యమేవ జయతే పేరిట బిజెపి నాయకులు ఆదివారం తిరుపతిలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. 

ఈ సమావేశంలో సోము వీర్రాజు, మాధవ్, సురేష్ పాల్గొన్నారు. చంద్రబాబుకు వారు వేసిన పది ప్రశ్నలు ఇవే...

1. పోలవరం ముంపు మండలాలను ఎపిలో కలపడం నమ్మక ద్రోహమా?
2. హోదా లోని రాష్ట్రానికి ప్యాకేజీ కింద 16 వేల కోట్ల రూపాయలు ఇచ్చినప్పటికీ మీరు తీసుకోకపోవడం నిజం కాదా?
3. రెవెన్యూ లోటులో టీడీపి వాగ్దానాలను కలపడం వాస్తవం కాదా?
4. హోదా తప్ప అన్ని హామీలను కేంద్రం అమలు చేసింది నిజం కాదా?
5. డీపీఆర్ లేకుండా రాజధాని కోసం రూ.1500 కోట్లు ఇచ్చి మరో వేయి కోట్లు ఇస్తామని కేంద్రం చెప్పలేదా?
6. పదేళ్లలో ఏర్పాటు చేయాల్సిన 11 విద్యాసంస్థలను నాలుగేళ్లలో ఏర్పాటు చేసింది నిజం కాదా?
7. చట్టంలో లేని విద్యాసంస్థలను, రక్షణ శాఖ ప్రాజెక్టులను ఇవ్వడం నిజం కాదా?
8. రాష్ట్రానికి 24 విద్యుత్ సంస్థలను, రక్షణ శాఖ ప్రాజెక్టులను ఇవ్వడం వాస్తవం కాదా?
9. ఏ రాష్ట్రానికీ ఇవ్వని విధంగా గ్రాంట్లు మంజూరు చేయడం నమ్మకద్రోహమా?
10. నాలుగు స్మార్ట్ సిటీలు, 33 అమృత నగరాలు ఇచ్ిచ మరీ అభివృద్ధి చేయడం మేం చేసిన ద్రోహమా? 

రాజధాని కోసం కేంద్రం రూ.1500 కోట్లు ఇచ్చినా కూడా చంద్రబాబు తాత్కాలిక భవనాలు మాత్రమే కట్టారని సోము వీర్రాజు అన్నారు. నిధులను సరిగ్గా వినియోగించుకోకపోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని అన్నారు. గుంటూరులో అతిసారాతో ప్రజలు చనిపోవడానికి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని విమర్శించారు. చంద్రబాబు ధర్మ పోరాట సభలో వాస్తవాలు వివరించాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. 

తిరుపతి సభలో ప్రధాని నరేంద్ర మోడీ హోదా గురించి అసలు ప్రస్తావించనే లేదని ఎమ్మెల్సీ మాధవ్ చెప్పారు. నెల్లూరు సభలో చెప్పినట్లుగానే ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారని అన్నారు. ప్రధాని మాట్లాడిన వీడియోలను మార్ఫింగ్ చేసి మరీ చంద్రబాబు చూపిస్తున్నారని ఆయన విమర్శించారు. 

ఎన్నికల సమయంలో ఇచ్చిన 600 హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా అని ఆయన చంద్రబాబును ప్రశ్నించారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ముఖ్యమంత్రి తనకు రక్షణగా నిలువాలని వారిని రోడం విడ్డూరంగా ఉందని అన్నారు. తాము సంధించిన పది ప్రశ్నలకు చంద్రబాబు కచ్చితంగా సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios