YS Sharmila: జగన్, బాబులను ఆడిస్తున్న రింగ్ మాస్టర్ బీజేపీ కాదా?: మోడీపై షర్మిల విమర్శలు
జగన్, బాబులను పంజరంలో పెట్టుకుని ఆడిస్తున్న రింగ్ మాస్టర్ బీజేపీనే అని వైఎస్ షర్మిల అన్నారు. పదేళ్లలో బీజేపీ వినాశకరపాత్ర పోషించిందని పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం చిలకలూరిపేటలో ప్రసంగించారు. కూటమిగా నిర్వహించిన ఈ సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ వైసీపీ, కాంగ్రెస్‌లపై విమర్శలు సంధించారు. ఈ రెండు పార్టీలు ఒకే ఒరలోని రెండు కత్తులు అని పేర్కొన్నారు. అంతేకాదు, ఆ రెండు పార్టీల నాయకత్వ ఒకే కుటుంబం నుంచి వచ్చిందని, ఈ విషయాన్ని మరచిపోకూడదని పరోక్షంగా జగన్, షర్మిలలు అన్నా చెల్లెలే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని వ్యాఖ్యానించారు. వైసీపీ తన వ్యతిరేక ఓటును కాంగ్రెస్‌కు మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నదని, కాబట్టి, వైసీపీకి ఓటు వేసినా.. కాంగ్రెస్‌కు వేసినా ఒక్కటేనని ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ఈ వ్యాఖ్యలపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఆగ్రహించారు.
కాంగ్రెస్, వైసీపీ పొత్తు అని మోడీ అబద్ధాలు చెబుతున్నారని వైఎస్ షర్మిల అన్నారు. అసలు అటు జగన్, ఇటు బాబును రెండు పంజరాల్లో పెట్టుకుని రింగ్ మాస్టర్‌లా బీజేపీ ఆడిస్తున్నదని ఆరోపించారు. ఈ పదేళ్లలో బీజేపీ వినాశకర పాత్ర పోషించిందని పేర్కొన్నారు. అలాంటిది ఇప్పుడు తనపై దాడులా? కాంగ్రెస్, వైసీపీ ఒకటేనని కూతలు కూస్తున్నారా? అని మండిపడ్డారు.
Also Read: 18న బీఆర్ఎస్‌లోకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. కేసీఆర్ సమక్షంలో..!
బీజేపీ ప్రవేశపెట్టే ప్రతి బిల్లుకు పార్లమెంటులో జగన్ పార్టీ మద్దతు ఇచ్చిందని షర్మిల అన్నారు. నరేంద్ర మోడీ మిత్రులైన అదానీ, అంబానీలకు రాష్ట్ర ఆస్తులను జగన్ సర్కారు కట్టబెట్టిందని ఆరోపించారు. అసలు మీరు కాంగ్రెస్ పార్టీకి భయపెడుతున్నారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తొలి సంతకం ప్రత్యేక మోదా మీదేనని తాము ఇచ్చిన హామీతో వణుకుపుడుతుందా? అని పేర్కొన్నారు.