Asianet News TeluguAsianet News Telugu

పవన్‌ను బీజేపీ ఇంటి మనిషిగానే చూస్తున్నది.. మోడీ కార్యక్రమానికి చంద్రబాబు విపక్ష నేతగానే: విష్ణువర్ధన్ రెడ్డి

ప్రధాని మోడీ భీమవరంలో అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు టీడీపీ అధినేతగా కాకుండా ప్రతిపక్ష నేతగా హాజరవ్వాలని తెలిపారు. పవన్ కళ్యాణ్‌ను బీజేపీ వేరుగా చూడటం లేదని వివరించారు.
 

bjp not treating pawan kalyan as seperate says party leader s vishnuvardhan reddy
Author
Amaravati, First Published Jul 2, 2022, 8:20 PM IST

విజయవాడ: ప్రధాని నరేంద్ర మోడీ ఎల్లుండి భీమవరంలో పర్యటిస్తారని, అక్కడ సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించి బహిరంగ సభలో పాల్గొంటారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి ఈ రోజు రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ఉదయం 10.10 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకుంటారని, అక్కడి నుంచి హెలిప్యాడ్‌లో భీమవరం చేరుకుంటారని చెప్పారు. ఉదయం 11 గంటలకు భీమవరం చేరుకుని అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని వివరించారు.

ఈ కార్యక్రమం రాజకీయాలకు అతీతంగా జరుగుతున్నదని, కవులు, కళాకారులు, గాయనీ, గాయకులతోపాటు ప్రతిపక్ష పార్టీలకు ఆహ్వానాలు పంపించామని చెప్పారు. అలాంటి ఈ కార్యక్రమాన్ని రాజకీయం చేయరాదని కోరారు. ఈ కార్యక్రమాన్ని బీజేపీ నిర్వహించడం లేదని, భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ నిర్వహిస్తున్నదని తెలిపారు. అల్లూరి విగ్రహావిష్కరణ చేయాలని రాష్ట్ర పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరిందని వివరించారు.

ఇదే సమావేశంలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్‌ను బీజేపీ వేరుగా చూడటం లేదని, తమ ఇంట్లోని వ్యక్తిలానే చూస్తున్నామని వివరించారు. మోడీ కార్యక్రమానికి జనసేన, బీజేపీ కలిపే ఆహ్వానిస్తున్నామని తెలిపారు. అదే సందర్భంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై వేరుగా స్పందించారు. అల్లూరి విగ్రహావిష్కరణకు చంద్రబాబును టీడీపీ అధినేతగా పిలవడం లేదని, కేవలం ప్రతిపక్షనేతగానే పిలుస్తున్నామని వివరించారు. 

ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. చిల్లర రాజకీయాలు చేసే టీఆర్ఎస్‌ను ఈ కార్యక్రమానికి పిలవడం లేదని అన్నారు. తెలంగాణకు ప్రధాని మోడీ వస్తే కేసీఆర్ ఆహ్వానించకపోవడం దొరతనానికి నిదర్శనం అని విమర్శించారు. కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారని, ఆయన దళిత, ఆదివాసీ వ్యతిరేక నేత అని ఆరోపించారు. కేసీఆర్ దిగజారుడు వ్యాఖ్యలను బీజేపీ ఖండిస్తున్నదని అన్నారు.

దేశమంతా అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతుంటే.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం జగన్ రాజ్యాంగం అమలు అవుతున్నదని విమర్శలు గుప్పించారు. మంత్రివర్గాన్ని బర్తరఫ్చ ేసి అన్ని శాఖలు సజ్జలకు ఇస్తే సరి అని, అన్ని అంశాలు సజ్జల మాట్లాడితే మిగతా మంత్రులంతా డమ్మీలా? అని ప్రశ్నించారు. మంత్రులకు చేవ, రక్తం ఉంటే బయటకు వచ్చి హక్కుల కోసం పోరాడాలని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల ఆస్తులు భారీగా పెరిగాయని ఆరోపించారు. వైసీపీ అసమర్థ పాలన కారణంగా రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించి బస్సు చార్జీలు పెంచితే బాగుండేదని తెలిపారాు. కానీ, అదేమీ చేయకుండా బస్సు చార్జీలు పెంచడం సిగ్గు చేటు అని విమర్శించారు.

Follow Us:
Download App:
  • android
  • ios