విశాఖపట్టణం: చంద్రబాబు నాయుడు ఏం చేసినా కూడ టీడీపీ ఖాళీ కావడం ఖాయమని  బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చెప్పారు.

బుధవారం నాడు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో సోము వీర్రాజు భేటీ అయ్యారు. గంటా శ్రీనివాసరావుతో భేటీ అయిన తర్వాత ఎమ్మెల్సీ సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు.

Also read:చంద్రబాబుకి మరో షాక్.... బీజేపీలోకి గంటా

 ఈ అసెంబ్లీలో త్వరలోనే బీజేపీకి మంచి బలం పెరిగే అవకాశం ఉంటుందని చెప్పారు. టీడీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు, నేతలు తమ పార్టీలో చేరేందుకు చర్చలు జరుపుతున్నట్టుగా సోము వీర్రాజు తెలిపారు.

చంద్రబాబునాయుడు ఎన్ని చెప్పినా కూడ  ఆ పార్టీ ఖాళీ కావడం ఖాయమని సోము వీర్రాజు చెప్పారు. చంద్రబాబు మాటలను ప్రజలు విశ్వసించబోరని ఆయన అభిప్రాయపడ్డారు.

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో భేటీ సందర్భంగా జరిగిన చర్చలో  అన్ని  విషయాలను తాను మీడియాకు వివరించబోనని చెప్పారు. టీడీపీకి భవిష్యత్తులో 23 మంది ఎమ్మెల్యేలు ఉండరని ఆయన చెప్పారు.

టీడీపీ ఒక్కటే కాదు అన్ని పార్టీలకు చెందిన నేతలు తమతో టచ్‌లో ఉన్నారని వీర్రాజు తెలిపారు. ఏపీ రాష్ట్రంలో వైసీపీకి బీజేపీనే ఏకైక ప్రత్యామ్నాయం అవుతుందన్నారు సోము వీర్రాజు.ఏపీలో  బీజేపీని నెంబర్‌వన్ స్థానానికి తీసుకొచ్చేందుకు గాను అన్ని రకాల వ్యూహలతో తాము ముందుకు వెళ్తున్నట్టుగా సోము వీర్రాజు చెప్పారు. 

ఏపీ రాష్ట్రంల బలపడేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ప్రధానంగా టీడీపీకి చెందిన కీలక నేతలకు ఆ పార్టీ గాలం వేస్తోంది. ఈ నేపథ్యంలో కొందరు టీడీపీ నేతలు ఇప్పటికే బీజేపీ నేతలతో టచ్‌లోకి వెళ్లారు. మరకొందరు నేతలు కూడ బీజేపీలో చేరేందుకు సన్నాహలు చేసుకొంటున్నారు.

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు బీజేపీలో చేరుతారని ప్రచారం సాగుతున్న తరుణంలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు గంటా శ్రీనివాసరావుతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకొంది. 

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇటీవల ప్రధానమంత్రి మోడీతో కూడ భేటీ అయ్యారు. గంటా శ్రీనివాసరావు బీజేపీలో చేరే అవకాశం ఉందని చెబుతున్నారు.టీడీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు కూడ బీజేపీ తీర్థం పుచ్చుకొనే అవకాశం ఉందని చెబుతున్నారు. 

విశాఖ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు కూడ బీజేపీలో చేరే అవకాశం ఉందని  ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.