‘రాజకీయంగా అన్ని నిర్ణయాలకు తమ పార్టీ సిద్ధంగా ఉంద’ని విశాఖపట్నం బిజెపి ఎంపి కంభంపాటి హరిబాబు తాజాగా చేసిన వ్యాఖ్యలతో టిడిపి ఉలిక్కిపడుతోంది. హటాత్తుగా హరిబాబు ఈ వ్యాఖ్యలను ఎందుకు  చేశారో అర్ధం కావటం లేదు. పైగా ఏపిలో జరిగిన అభివృద్ధి కేంద్రప్రభుత్వం చలవేనంటూ ఘాటుగా చెప్పారు. కేంద్రం సహకరించకుంటే ఏపిలో అభివృద్ధి ఎలా సాద్యమవుతుంది? అంటూ రాష్ట్రప్రభుత్వాన్ని నిలదీసారు.

శుక్రవారం మీడియాతో హరిబాబు మాట్లాడుతూ, ఏపీ విభజనచట్టం 2014 అమలు చేయడంలో కేంద్రం చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు. 10 ఏళ్ళ లోపు ఏపీ చట్టం 2014 అమలు చేయాలని ఉన్నప్పటికీ కేంద్రం మాత్రం నాలుగేళ్లలో ఏపీ అభివృద్ధికి కృషి చేసిందన్నారు. ఏపీ విభజన చట్టం 2014లో ఆరు అంశాలను పరిశీలించాలని కేంద్రం సూచించిందని, ఏపీ అభివృద్ధికి కేంద్రం కృషి చేస్తోందని ఆయన చెప్పారు.

కేంద్రం రాష్ట్రానికి ఏమి ఇచ్చిందో యదార్థంగా చంద్రబాబునాయుడు ఒప్పుకోవాలని హరిబాబు విజ్ఞప్తి చేయటం గమనార్హం. ప్రజలు యదార్థాలు తెలుసుకోవాలని చెబుతూనే ఇంకా కేంద్రం నుంచి కావాలంటే అడుగుదామన్నారు. మొత్తం మీద పొత్తుల విషయంలో రోజుకో ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో రాజకీయ నిర్ణయానికి బిజెపి సిద్ధంగా ఉందని చెప్పటంతో బిజెపిలో ఏమి జరుగుతోందో అర్ధం కావటం లేదు.