చిచ్చుపెట్టి రాజధానిని మార్చే ప్రయత్నం:జగన్ పై బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఫైర్
ప్రజలు కోరుకున్న అమరావతిలోనే రాజధాని ఉంటుందని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చెప్పారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రంలో చిచ్చు పెట్టేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు
తిరుపతి: రాష్ట్రంలో చిచ్చు పెట్టి రాజధానిని మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఏపీ సీఎం వైఎస్ జగన్ పై బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఆరోపించారు.ఆదివారం నాడు తిరుమల శ్రీవారిని సీఎం రమేష్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ సర్కార్ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడ అవి తాత్కాలికమేననన్నారు.ప్రజలంతా తీర్మానించిన అమరావతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా కొనసాగనుందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితులపై కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల అంశాన్ని తెరమీదికి తీసుకు వచ్చింది. 2014లో ఏపీలో అధికారంలో ఉన్న చంద్రబాబునాయుడు అమరావతిలో రాజధానిని ఏర్పాటు చేశారు. ఆ సమయంలో అమరావతిలో రాజధానికి జగన్ కూడా అంగీకరించారని విపక్షాలు గుర్తు చేస్తున్నాయి. కానీ ఇప్పుడు మూడు రాజధానుల అంశాన్ని తెరమీదికి తీసుకురావడాన్ని విపక్షలు తప్పు బడుతున్నాయి.
ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ఉద్దేశ్యంతో జగన్ సర్కార్ మూడు రాజధానుల అంశాన్ని తెరమీదికి తెచ్చిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని కోరుతూ అమరావతి రైతులు పాదయాత్ర సాగిస్తున్నారు. అమరావతి నుండి అరసవెల్లికి రైతులు పాదయాత్ర నిర్వహిస్తున్నారు. మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ కార్యక్రమాలు నిర్వహిస్తుంది.
also read:రాజధానిగా అమరావతిని వైఎస్ జగన్ సమర్ధించలేదు.. భూమన కరుణాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి మూడు రాజధానులకు మద్దతుగా ప్రజాభిప్రాయాన్ని వైసీపీ కూడగట్టింది.మూడు రాజధానులు ఏర్పాటు కోరుతూ జేఏసీ ఏర్పాటైంది. ఈ నెల 15 న జేఏసీ ఆధ్వర్యంలో విశాఖలో గర్జన నిర్వహించారు. అయితే ఈ సభలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రులపై జనసేన దాడికి దిగింది. ఈ దాడితో తమకు సంబంధం లేదని జనసేన తేల్చిచెప్పింది. వైసీపీ శ్రేణులే దాడి చేసి తమపై నెపం నెట్టారని జనసేన వివరించింది. ఈ దాడితో సంబంధం ఉందనే ఆరోపణలపై సుమారు వందమంది కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.