బిజెపి శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు చంద్రబాబునాయుడుపై సంచలన ప్రకటన చేశారు. పోయిన ఎన్నికల్లోనే తమ మద్దతు లేకపోతే వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అయి ఉండేవారంటూ పెద్ద బాంబు పేల్చారు. మీడియాతో విష్ణు మాట్లాడుతూ, రాష్ట్రంలో బీజేపీ, పవన్‌కల్యాణ్‌ అండతోనే తెలుగుదేశం అధికారంలోకి వచ్చిందని, లేకపోతే జగన్‌ సీఎం అయి, చంద్రబాబు ప్రతిపక్షంలో కూర్చునేవాడని చేసిన ప్రకటన కలకలం రేపుతోంది.

ఒక ప్రైవేటు ఆస్పత్రిలో జరిగిన కార్యక్రమంలో ఎంఎల్ఏ మాట్లాడుతూ మిత్రపక్షం కాబట్టే ఇంతకాలం సంయమనంతో వ్యవహరించామని, ఇకపై ప్రజాసమస్యలపై పోరాటం చేస్తామని హెచ్చరించారు. విశాఖలో జరిగిన భూ కుంభకోణాలు తన వల్లే బయటకు వచ్చిందని సిట్‌ ఏర్పాటుకు ప్రధాన కారణం తానేనన్నారు.

ఏపీలో ప్రస్తుతం బీజేపీయే ప్రతిపక్ష పాత్రను పోషిస్తోందని చెప్పారు. టీడీపీ నాయకుల అవినీతి పెరిగిపోయిందని, ఇసుక మాఫియాలు దోచుకుంటున్నాయని ఆరోపించారు. విశాఖ కేంద్రంగా ఈ ఏడాదే రైల్వేజోన్‌ ఏర్పాటు అవుతుందని నమ్మబలికారు.