తాడేపల్లి గూడెం: బీజేపీ ఎమ్మెల్యే, మాజీమంత్రి పైడికొండల మాణిక్యాలరావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం తీరును నిరసిస్తూ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ప్రజలకిచ్చిన హామీలను అమలు పరచడంలో టీడీపీ సర్కార్ విఫలమైందని ఆరోపిస్తూ ఆయన రాజీనామా చేసినట్లు వెల్లడించారు. 

నియోజకవర్గానికి ఇచ్చిన సుమారు 56 హామీలు నెరవేర్చనందుకే రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. 15 రోజుల్లోగా సీఎం చంద్రబాబు స్పందించాలని అల్టిమేటం జారీ చేశారు. మాణిక్యాలరావు తాడేపల్లిగూడెం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 

తాడేపల్లిగూడెం నియోజవర్గానికి సంబంధించి పలు సమస్యల పరిష్కారానికై 3 నెలలుగా చంద్రబాబు చుట్టూ తిరుగతున్నా పట్టించుకోవడం లేదని మాణిక్యాలరావు వాపోయారు. 
మంగళవారం ఉదయం మాణిక్యాలరావు మీడియాతో మాట్లాడిన ఆయన 15 రోజుల్లోగా సీఎం స్పందించకపోతే 16వ రోజు నుంచి నిరాహారదీక్షకు దిగుతానని హెచ్చరించారు. 

చంద్రబాబు ఈ నియోజకవర్గానికి ఇచ్చిన హామీలకు సంబంధించిన వివరాలతో కూడిన పత్రాన్ని పంపిస్తున్నానని తెలిపారు. ఇలాంటి శాసనసభలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నాని ఈటెల స్పష్టం చేశారు. 

తాడేపల్లి గూడెంలో మీ తెలుగుదేశం పార్టీ లేనందుకే ఎటువంటి అభివృద్ధి పనులు చేయడం లేదని తాను భావిస్తున్నట్లు తెలిపారు. తనను తొలగించి అయినా సరే ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చండంటూ కోరారు. తన రాజీనామాను చంద్రబాబే స్పీకర్‌కు పంపించాలంటూ మాణిక్యాలరావు వ్యాఖ్యానించారు. 

మాణిక్యాలరావు రాజీనామాతో ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. మాజీమంత్రి ఏదైనా వ్యూహంతో రాజీనామా చేశారా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జనవరి 6న ఏపీకి మోదీ వస్తున్న తరుణంలో రాజీనామా చెయ్యడం ఏదో వ్యూహం ఉండే ఉంటుందని అంతా గుసగుసలాడుకుంటున్నారు. 
 

ఈ వార్తలు కూడా చదవండి

మాజీ మంత్రి మాణిక్యాల రావు సంచలన నిర్ణయం