తాడేపల్లి గూడెం: మాజీమంత్రి, తాడేపల్లి గూడెం బీజేపీ ఎమ్మెల్యే మాణిక్యాలరావు సంచలన నిర్ణయం తీసుకోనున్నారు. త్వరలోనే తన పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు  తెలుస్తోంది. తాడేపల్లి నియోజకవర్గానికి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే రాజీనామా చేస్తానని అనుచరుల వద్ద వాపోయినట్లు సమాచారం.

తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నానని అయితే స్థానిక నాయకత్వం తనను పనిచెయ్యనివ్వడం లేదని వాపోయినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా నియోజకవర్గాన్ని ఎంత అభివృద్ధి చేద్దామని ప్రయత్నించినా టీడీపీలోని కీలక నేతలు అడ్డుపడుతున్నారంటూ మాణిక్యాలరావు ఆరోపించారు.

15 రోజుల్లో తాడేపల్లి నియోజకవర్గానికి ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కృషి చేస్తానని లేని పక్షంలో తన పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరారు. 

ఇకపోతే 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీల పొత్తులో భాగంగా తాడేపల్లి నియోజకవర్గాన్ని మాణిక్యాలరావుకు కేటాయించారు. దీంతో ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాణిక్యాలరావు విజయం సాధించారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కేబినేట్ లో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. 

అయితే ఎన్డీఏ నుంచి టీడీపీ వైదొలగడంతో చంద్రబాబు నాయుడు కేబినేట్ లో మంత్రులుగా ఉన్న మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్ లు తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. రాజకీయాల్లో ముక్కుసూటిగా ఉంటూ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే వ్యక్తిగా మాణిక్యాలరావును చెప్తుంటారు. అయితే మాణిక్యాలరావు రాజీనామా వ్యవహారం ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.