ప్రతీ యాక్షన్ కు రియాక్షన్ తప్పదంటారు. అదేవిధంగా కేంద్రంలోని టిడిపి మంత్రులు వైదొలగాలని నిర్ణయించుకున్నట్లే, రాష్ట్రం మంత్రివర్గం నుండి బిజెపి మంత్రులు తప్పుకున్నారు. తాము మంత్రివర్గం నుండి తప్పుకోవాలని నిర్ణయించినట్లు బిజెపి మంత్రులు పైడికొండల మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాసరావులు తమ సహచరులతో స్పష్టం చేశారు.

కేంద్రప్రభుత్వ వైఖరికి నిరసనగా తమ ఎంపిలు కేంద్రమంత్రివర్గం నుండి తప్పుకుంటున్నట్లు చంద్రబాబునాయుడు బుధవారం రాత్రి చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే. చంద్రబాబు నిర్ణయంపై బిజెపి ప్రజాప్రతినిధులు అత్యవసర సమావేశం జరిపారు. కేంద్రంలో టిడిపి మంత్రులు తప్పుకోగానే రాష్ట్రంలో బిజెపి మంత్రులు కూడా తప్పుకోవాలని నిర్ణయించారు.

దానికి అనుగుణంగానే ఉదయం అసెంబ్లీ ప్రారంభమవ్వగానే మంత్రులు అచ్చెన్నాయుడు, గంటా శ్రీనావసరావు తదితరులతో మాట్లాడారు. క్యాబినెట్ సమావేశం ముగియగానే బిజెపి మంత్రులిద్దరూ చంద్రబాబును కలిసి తమ రాజీనామాలు సమర్పించారు. అంతకుముందు జరిగిన మంత్రివర్గం సమావేశంలో కూడా పాల్గొనలేదు.