‘కన్నా.. చంద్రబాబుకన్నా సీనియర్’

bjp ledaer ram madhav fire on ap cm chandrababu
Highlights

టీడీపీ, బీజేపీ పొత్తుతోనే అధికారంలోకి

అల్మట్టి పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నోట్లో మట్టి కొట్టిన దేవెగౌడను చంద్రబాబునాయుడు కౌగిలించుకోవడం దారుణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. గుంటూరు సిద్దార్థ గార్డెన్స్ లో జరిగిన కార్యక్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ... బీజేపీపై తెలుగుదేశం పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా కలిసి పనిచేస్తామని ఆయన తెలిపారు.

అనంతరం బీజేపీ నేత రామ్ మాధవ్ మాట్లాడుతూ.. ఏపీలో తమ పార్టీని సమర్థవంతంగా నడిపించగల బాధ్యత కన్నా లక్ష్మీనారాయణకు ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు తాను రాజకీయాల్లో చాలా సీనియర్ అని చెప్పుకుంటూ ఉంటాడని.. అయితే.. కన్నా.. చంద్రబాబుకన్నా కూడా నాలుగైదేళ్లు సీనియర్ అని అన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది కాబట్టే.. అధికారంలోకి రాగలిగిందని చెప్పారు.


ఏపీలో భవిష్యత్తు బీజేపీదేనని ఆయన అన్నారు. టీడీపీ లాంటి వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ కు వ్యతిరేక శక్తిగా నాడు ఎన్టీఆర్ టీడీపీని స్థాపించిన విషయాన్ని గుర్తుచేశారు. ఎన్టీఆర్ లక్ష్యాలను తుంగలో తొక్కి బాబు కాంగ్రెస్ తో చేతులు కలిపారని మండిపడ్డారు. కర్ణాటక పరిస్థితులు ఏపీలో ఉన్నాయన్నారు. టీడీపీ ధర్మపోరాట దీక్షలపై ప్రజలే తీర్పులు ఇస్తారన్నారు. 2019లో ఏపీలోని బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తిరుమల వెంకటేశ్వర స్వామికి కూడా కులాన్ని అంటగడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ కుల రాజకీయాలు చేస్తోందన్నారు.  దేవుడిపై కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారన్నారు. 

loader