గుంటూరు: కరోనా సమయంలో కళాశాలలు మూసివేయడం వల్ల కాంట్రాక్ట్ లెక్చరర్లు రోడ్డునపడ్డారని... గత ఐదు నెలలుగా జీతాలు లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి సీఎం జగన్ దృష్టికి తీసుకువచ్చారు. వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విష్ణవర్ధన్ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. 

''ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు... మీరు ఇచ్చిన మాటను మరిచారా? మీరు అధికారంలోకి రాకముందు రాష్ట్రంలో పనిచేసే ప్రభుత్వ జూనియర్ మరియు డిగ్రీ కళాశాలలో పనిచేసే లెక్చరర్ కు సంబంధించి కాంట్రాక్టు ప్రాతిపదికన పని చేస్తున్న వాళ్లకు ప్రభుత్వ సమానంగా వేతనాలు ఇస్తామని, వారికి మేము అధికారంలోకి వచ్చిన తరువాత న్యాయం చేస్తామని మీరు హామీ ఇచ్చారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఒక జీవోను కూడా మీ ప్రభుత్వం (GO.RT NO-217) విడుదలచేశారు. 3720 మంది జానియర్ లెక్చరర్లుకు 37100 (వేల రూపాయలు ) డిగ్రీ లెక్చరర్లుకు 40000 వేల రూపాయలు వేతనం ఇస్తున్నట్లు ఆ జీవో ద్వారా మీరు ప్రకటించారు'' అని గుర్తుచేశారు. 

''అయితే ప్రస్తుతం జూనియర్, డిగ్రీ లెక్చరర్లు 4414 మంది 5 నెలల నుండి జీతాలులేక అల్లాడుతున్నారు. దాదాపు ఐదు నెలల నుంచి జూనియర్ మరియు డిగ్రీ కళాశాల లెక్చరర్లకు వేతనాలు ఇవ్వడంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించింది. దీంతో కేవలం జీతాల మీద ఆధారపడిన లెక్చరర్లు ఆర్థిక మరియు ఇతర ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకోవడం, చనిపోవడం కూడ జరుగుతుంది'' అని అన్నారు. 

read more   పని ఒత్తిడిని తగ్గించుకొనేందుకు యోగా, ప్రాణాయామం చేయాలి: మోడీ

''కేవలం ఆర్థిక ఇబ్బందుల వల్ల వాళ్లే కాదు మొత్తం కుటుంబం అనేక సమస్యలను ఎతుర్కొంటున్నాయి. కోవిడ్-19  సమయంలో  ఈ వేతనం మీద ఆధారపడి జీవించేటటువంటి ఆరుగురు  కాంట్రాక్టు లెక్చరర్లు ఇటీవలే చనిపోవడం జరిగింది. ఇది చాలా బాధాకరం'' అని ఆవేదన వ్యక్తం చేశారు. 

''ఘోరమైన విషయాన్ని మీకు ఈ లేఖ ద్వారా నేను తెలియజేస్తున్నాం.మీరు లబ్దిదారులు అందరికీ నెలసరి ఖాతాల్లో జమ చేస్తున్నామని చెప్పి  ప్రతి నెల మీడియాకు వాలంటిర్ల ద్వార లెక్కలు చెబుతున్నారు. దీని ద్వారా చక్కటి ప్రచారం చేస్తున్నారు. అదే రకంగా ఉన్నత విద్యను చదివి కాంట్రాక్టు ప్రాతిపదికన బిక్కుబిక్కుమంటూ ఉద్యోగ భద్రతలేకుండా మానసిక సంఘర్షణల మద్య పనిచేసే ఈ  నిరుద్యోగులకు ప్రభుత్వం జీతం ఇచ్చి ప్రచారం చేసుకోండి. ఇవ్వకపోతే దాని మీద ఆధారపడి జీవించే వాళ్లు మరియు వాళ్ల కుటుంబ సభ్యులు ఏరకంగా బ్రతకాలి?'' అని ప్రశ్నించారు. 

''కాంట్రాక్ట్ లెక్చరర్లనే కాదు వారి మీద ఆధారపడే దాదాపు 15 వేల మందిని ఆదుకోవాలని నేను మీకు విజ్ఞప్తి  చేస్తున్నాను. అలాగే చనిపోయిన 6మంది లెక్చరర్ లకు సంబంధించి ప్రభుత్వం విచారణ జరిపి వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి 50 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం కూడా అందించాలిని డిమాండ్ చేస్తున్నాను. మానవతా దృక్పథంతో వారి కుటుంబ సభ్యులను ఆదుకోవాలని మరో విజ్ఞప్తి కూడ మీకు చేస్తున్నాను. ఇందుకోసం మీరు తక్షణం అధికారులకు ఆదేశాలు జారీ చేసి వారి న్యాయమైన సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కోరుతున్నాను'' అంటూ విష్ణువర్ధన్ రెడ్డి సీఎం జగన్ ను కోరారు.