చంద్రబాబు పాల్పడుతున్న అప్రజాస్వామిక చర్యలు భాజపా మీద కూడా ప్రభావం పడతాయని పురంధేశ్వరి ఆందోళన వ్యక్తం చేసారు.

చంద్రబాబునాయుడుపై భాజపా నేత పురంధేశ్వరి ఫిర్యాదు చేసారు. మిత్రపక్షం టిడిపి వల్ల ఏపిలో ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతున్నట్లు ధ్వజమెత్తారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోడి, జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కు పురంధేశ్వరి లేఖ రాయటంతొ కలకలం మొదలైంది. మంత్రివర్గ ప్రక్షాళనలో నలుగురు వైసీపీ ఎంఎల్ఏలకు చంద్రబాబు స్ధానం కల్పించారు. దాంతో ఇటు వైసీపీతో పాటు మిగిలిన విపక్షాలు కూడా చంద్రబాబుపై మండిపడుతున్నాయి. అదేవిధంగా టిడిపి నేతలు కూడా చంద్రబాబు వైఖరిని బాహాటంగానే తప్పుపడుతున్నారు.

ఫిరాయింపులకు మంత్రివర్గంలో చోటు కల్పించటతో ఇంటా బయట ఎదురౌతున్న విమర్శలను చంద్రబాబు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపధ్యంలోనే మిత్రపక్ష నేత పురంధేశ్వరి కూడా చంద్రబాబుపై ధ్వజమెత్తటం గమనార్హం. అంటే చంద్రబాబు వైఖరిపై భాజపాలో కూడా మెజారిటీ నేతలు తప్పుపడుతున్నారని సమాచారం. చంద్రబాబు పాల్పడుతున్న అప్రజాస్వామిక చర్యలు భాజపా మీద కూడా ప్రభావం పడతాయని పురంధేశ్వరి ఆందోళన వ్యక్తం చేసారు. ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని ఆమె స్పష్టం చేసారు.

చంద్రబాబు ప్రోత్సహిస్తున్న ఫిరాయింపులను చూస్తు ఊరుకుంటే, భాజపా ఇమేజ్ కూడా దెబ్బతింటుందని స్పష్టంగా లేఖలో పేర్కొన్నారు. ఏపి క్యాబినెట్లో ఫిరాయింపు ఎంఎల్ఏలకు చోటు కల్పించటాన్ని తప్పుపట్టారు. ఏపి, తెలంగాణాలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోందని నొక్కి చెప్పారు. అయినా పురంధేశ్వరి లేఖ రాయటం వరకూ బాగానే ఉంది. ఈ విషయం మోడికి, అమిత్ షాకు తెలీదా? చంద్రబాబును దగ్గరుండి మరీ ప్రోత్సహిస్తోంది వెంకయ్యనాయుడే అన్న విషయం పురంధేశ్వరికి తెలీదా? మరీ అన్నీ తెలిసీ పురంధేశ్వరి లేఖ రాయటంలో ఉద్దేశ్యం ఏమైఉంటుంది?