Purandeswari: భువనేశ్వరి వ్యక్తిత్వంపై దాడి జరిగిన తీరు బాధించింది.. రాజీపడే ప్రసక్తే లేదు.. పురంధశ్వేరి
భువనేశ్వరిపై(nara bhuvaneshwari) వైసీపీ నేతల వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టుగా ఆమె సోదరి, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి (daggubati purandeswari) తెలిపారు. ఇలాంటి వాటిని సహించే ప్రసక్తే లేదన్నారు. తోబుట్టువులమైన తామిద్దరం నైతిక విలువలతో పెరిగామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో (ap assembly sessions) తన సతీమణిని దూషించారంటూ తెలుగు దేశం పార్టీ (telugu desam party) అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) మీడియా సమావేశంలో బోరున విలపించడం.. రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై పలువురు రాజకీయ నాయకులు స్పందిస్తున్నారు. చంద్రబాబుకు సంఘీభావం తెలుపుతున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఎన్టీఆర్ కుటుంబం నుంచి ఫస్ట్ రియాక్షన్ వచ్చింది. భువనేశ్వరిపై(nara bhuvaneshwari) వైసీపీ నేతల వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టుగా ఆమె సోదరి, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. ఇలాంటి వాటిని సహించే ప్రసక్తే లేదన్నారు.
తన సోదరి భువనేశ్వరి వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు ప్రయత్నించిన తీరు బాధించినట్టుగా పురందేశ్వరి పేర్కొన్నారు. తోబుట్టువులమైన తామిద్దరం నైతిక విలువలతో పెరిగామని చెప్పారు. ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని daggubati purandeswari స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
మరోవైపు ఇందుకు సంబంధించి నందమూరి హరికృష్ణ కుమార్తె, టీడీపీ నాయకురాలు నందమూరి సుహాసిని కూడా స్పందించారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజం... కానీ వ్యక్తిగత దూషణలకు దిగడం చాలా బాధాకరమని ఆమె అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సి వారే అపహాస్యం చేయడం తగదని వ్యాఖ్యానించారు. తెలుగు ప్రజలు చంద్రబాబు వెంటే ఉన్నారని ఆమె అన్నారు.
ఈ ఘటనపై ఇప్పటికే స్పందించిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) .. తన భార్యను అవమానించారని, ఆమె గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లేలా మాట్లాడారని చంద్రబాబునాయుడు కంటతడి పెట్టడం బాధ కలిగించిందని వ్యాఖ్యానించారు. ఓవైపు రాష్ట్రాన్ని వరదలు (floods) అతలాకుతలం చేస్తుంటే అవేమీ పట్టని ప్రజాప్రతినిధులు ఆమోదయోగ్యంకాని విమర్శలు, వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని పవన్ కల్యాణ్ విమర్శించారు. ఇటీవల కాలంలో సభలు, సమావేశాలు, ఆఖరికి టీవీ చానళ్ల చర్చా కార్యక్రమాల్లో వాడుతున్న పదజాలం సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉందని పవన్ పేర్కొన్నారు. తాజాగా ఏపీ శాసనసభలో విపక్ష నేత కుటుంబ సభ్యులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అత్యంత శోచనీయమని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో సీఎం జగన్ (ys jagan mohan reddy) కుటుంబ సభ్యులను కూడా కొందరు తక్కువచేసి మాట్లాడినప్పుడు తాను ఖండించిన విషయాన్ని పవన్ గుర్తుచేశారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు మహిళల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలని జనసేనాని హితవు పలికారు.
Also Read: Chandrababu Naidu: ప్రెస్‌మీట్‌లో బోరున విలపించిన చంద్రబాబు నాయుడు.. వెక్కి వెక్కి ఏడ్చిన వైనం
బీజేపీ నేత సుజానా చౌదరి కూడా దీనిని ఖండించారు. ‘రాష్ట్రంలో రాజకీయాలు ఇంత అధమస్థాయికి దిగజారడం బాధాకరం. ఇన్నాళ్ళూ వ్యక్తిగత దూషణలు జుగుప్స కలిగించాయనుకుంటే, ఇవాళ శ్రీ చంద్రబాబు సతీమణిని అసభ్యంగా దూషించి వైసీపీ రాష్ట్ర రాజకీయాలను నీచాతినీచ స్థాయికి దిగజార్చింది. ఇది సిగ్గుచేటు. దీన్ని నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.
ఇక, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శుక్రవారం అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వైసీపీ నాయకుల చేసిన కామెంట్స్ తనను తీవ్రంగా బాధించాయని చంద్రబాబు తెలిపారు. మళ్లీ సీఎం అయిన తర్వాతే అసెంబ్లీలో అడుగుపెడతానంటూ శపథం చేశారు. ఆ తర్వాత ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ బోరున విలపించారు.