తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలిపై ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. 24 మంది సభ్యులతో పాలకమండలిని ప్రకటించింది. అయితే ఇందులో కొందరి పేర్లపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలిపై ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. 24 మంది సభ్యులతో పాలకమండలిని ప్రకటించింది. అయితే ఇందులో కొందరి పేర్లపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి స్పందిస్తూ.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితుడిగా ఉన్న శరత్ చంద్రారెడ్డిని టీటీడీ బోర్డు సభ్యునిగా నియమించడం సమంజసం కాదని అన్నారు. టీటీడీ బోర్డు రాజకీయ పునరావాస కేంద్రంగా మారిపోయిందని విమర్శించారు.
టీటీడీ బోర్డు సభ్యుల విషయంలో అప్పట్లో ఉన్న నియమ నిబంధనలను సీఎం జగన్ గాలికి వదిలేశారని విమర్శించారు. 2019 లో 81 మందిని టీటీడీ బోర్డు సభ్యులుగా నియమించారన్నారని.. కోర్టు సూచనతో 51 మందిగా కుదించారన్నారు. టీటీడీ బోర్డులో ఆధ్యాత్మిక చింతన, హిందూ మత సంప్రదాయాలను పాటించే వారినే సభ్యులుగా నియమించాలని డిమాండ్ చేశారు.
టీటీడీ ఏమైనా వైఎస్ జగన్ దేవస్థానమా? అని ప్రశ్నించారు. వైసీసీ నేతలు పెట్టే కేసులకు, పోలీసులకు భయపడే వారు బీజేపీలో లేరని చెప్పారు. రాబోయే రోజుల్లో తిరుమల శ్రీవారి భక్తులను కలుపుకుని ఆందోళన చేపడతామని చెప్పారు. అడ్డదారుల్లో టీటీడీ పాలకమండలి నియామకాలు చేపట్టడం ఇదే తొలిసారి అని మండిపడ్డారు. టీటీడీ నిధులను కూడా దారి మళ్లిస్తున్నారనే అనుమానం వ్యక్తం చేశారు. హిందూ ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే టీటీడీ డబ్బులను ఖర్చు పెట్టాలి. టీటీడీ పాలకమండలి సభ్యుల నియామకాల్లో కూడా కోట్లు చేతులు మారాయని ఆరోపించారు.
ఇక, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కూడా టీటీడీ పాలకమండలి సభ్యుల నియామకంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. టీటీడీ బోర్డు రాజకీయ పునరావాస కేంద్రమేనని ఏపీ సీఎం జగన్ మరోసారి నిరూపించారని పురందేశ్వరి విమర్శలు గుప్పించారు.
ఢిల్లీలో మద్యం కుంభకోణంలో పాలుపంచుకున్న శరత్ చంద్రారెడ్డి, అవినీతికి పాల్పడినట్లు గుర్తించి ఢిల్లీ హైకోర్టు ఎంసీఐ నుంచి తొలగించిన కేతన్ దేశాయ్ వంటి వ్యక్తులను టీటీడీ బోర్డుకు నామినేట్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. టీటీడీ బోర్డు, తిరుమల ఆలయ పవిత్రతపై ఏపీ సీఎం జగన్‌కు నమ్మకం లేదని విమర్శించారు. టీటీడీ పవిత్రను మసకబరిచే నియామకాలను బీజేపీ ఖండిస్తుందని స్పష్టం చేశారు.
