బీజేపీ ఎంపీ సుజనా చౌదరి, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ల భేటీ ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ఇప్పటికే వీరిపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పించారు.

తాజాగా ఈ వ్యవహారంపై కొందరు బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. నిమ్మగడ్డ వ్యవహరంపై బహిరంగంగా పోరాటం చేయమన్నామే తప్ప కుట్రలు చేయమన్నామా అని కొందరు బీజేపీ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. 

బాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తి ... రాజకీయ నేతలతో చర్చించాల్సిన అవసరం ఏంటని నిమ్మగడ్డను ప్రశ్నిస్తున్నారు. రమేశ్ కుమార్ విశ్వసనీయతపై ప్రశ్నలు వచ్చిన సమయంలో ఈ భేటీలు దేనికి నిదర్శనమన్నారు.

రాష్ట్రంలో టీడీపీ నేతలు వరుసగా అరెస్ట్ అవుతుండటంతో జగన్‌ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకే బీజేపీలోని కొందరు పెద్దల సూచన మేరకు ఈ భేటీ జరిగిందని పుకార్లు వినిపిస్తున్నాయి. 

ఇక్కడ గమనించాల్సిన మరో అంశం ఏంటంటే ఎస్ఈసీగా నిమ్మగడ్డ కొనసాగాలంటూ పిటిషన్ వేసిన వారిలో కామినేని కూడా ఉండటం. కరోనా సంక్షోభం తర్వాత ఇవాళ కాకపోయినా, రేపయినా ఏపీలో స్థానిక ఎన్నికలు జరుగుతాయి.

అందువల్ల జగన్‌పై మొదటి నుంచి దూకుడుగా వ్యవహరించిన రమేశ్ కుమార్‌కు ఆ సమయానికి ఎలాంటి అడ్డు లేకుండా చేయాలని బీజేపీలోని చంద్రబాబు అనుకూల వర్గం పావులు కదుపుతోందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇది నచ్చని కొందరు కాషాయ నేతలే ఈ ముగ్గురి భేటీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.