మిత్రపక్షాల మధ్య మాటల యుద్దం తారస్ధాయికి చేరుకుంటున్నట్లుంది. గురువారం ఢిల్లీలో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తో టిడిపి ఎంపి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు భేటీలో ఏమీ ఉపయోగం లేదని తేలిపోయింది. అమిత్ షా వాళ్ళిద్దరినీ ఏమాత్రం ఖాతరు చేయలేదని సమాచారం. దాంతో టిడిపి ఎంపిల సమావేశంలో చంద్రబాబు కేంద్రంపై మండిపడ్డారు. వెంటనే బిజెపి నేత సురేష్ రెడ్డి చంద్రబాబుపై ఎదురుదాడి మొదలుపెట్టారు. అందులో భాగంగానే చంద్రబాబు గాలి తీసేశారు.

సురేష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, అవసరానికి తగ్గట్లుగా మాట మార్చడం చంద్రబాబు నాయుడికే చెల్లిందన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడిన తర్వాత ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అని చంద్రబాబు అన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎప్పుడూ ఒంటరిగా గెలవలేదన్నారు. గతంలో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి, ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ వల్లే చంద్రబాబు ఏపీకి సీఎం అయ్యారని అభిప్రాయపడ్డారు.

ఏపీ మంత్రి నారాయణ నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పేదలకు ఇళ్ల నిర్మాణం పేరుతో టీడీపీ సర్కార్ అవినీతికి పాల్పడుతుందని ఆరోపించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీటి పథకాల్లోనూ అవినీతి జరుగుతోందన్నారు. టీడీపీ నేతలు కొందరు కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చుతున్నారని సురేష్ రెడ్డి మండిపడ్డారు. తమ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చెబుతున్నవన్నీ వాస్తవాలనేనని చెప్పారు.