చంద్రబాబునాయుడుతో తెగతెంపులు చేసుకోవటానికే భారతీయ జనతా పార్టీ నిర్ణయించుకున్నట్లుందా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. కర్నూలులో గురువారం జరిగిన రాయలసీమ బిజెపి నేతల అత్యవసర సమావేశంలో  ఓ అప్పీల్ చూస్తే పొత్తుల విషయంలో జరుగుతున్న ప్రచారం నిజమే అనిపిస్తోంది.

ఇంతకీ విషయం ఏమిటంటే, బిజెపి నేతల అత్యవసర సమావేశంలో రాయలసీమ అభివృద్ధికి అనేక తీర్మానాలు చేశారు. వాళ్ళు చేసిన తీర్మానాలన్నీ చంద్రబాబుకు ఇబ్బంది కలిగించేవే అనటంలో సందేహం లేదు. అయితే, అన్నింటిలోనూ కీలకమైన పరిణామం ఒకటుంది.

అదేంటంటే, చంద్రబాబు, ఫిరాయింపు మంత్రి, ఎంఎల్సీ రామసుబ్బారెడ్డిపై హై కోర్టు సూమోటోగా కేసు నమోదు చేయాలని బిజెపి నేతలు హైకోర్టుకు అప్పీల్ చేశారు. ఫిరాయింపు మంత్రి ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగులో కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ, అవినీతి సంపాదన గురించి పూసగుచ్చినట్లు చెప్పారు. తన సంపాదించే ప్రతీ రూపాయిలో అర్దరూపాయి ఎంఎల్సీ రామసుబ్బారెడ్డికి ఇవ్వాలని మంత్రి చెప్పారు.

అసలు ఫిరాయింపు మంత్రికి ఎంఎల్సీకి ఏమాత్రం పడదన్న విషయం అందరికీ తెలిసిందే. అటువంటిది ఈమధ్య ఎంఎల్సీ మంత్రి గురించి ఏమాత్రం మాట్లాడటం లేదు. ఎందుకన్న విషయం మంత్రి కార్యకర్తలతో చెబితేనే అందరికీ తెలిసిందే. మంత్రి మాటలతో అందరూ ముక్కున వేలేసుకున్నారు. అదే విషయాన్ని బిజెపి నేతలు చర్చించుకున్నారు. మంత్రి మాటలతో అవినీతి ఏస్ధాయిలో పెరిగిపోయిందో అర్ధమవుతోందని నేతలు మండిపడ్డారు. అందుకనే ముఖ్యమంత్రి, ఫిరాయింపు మంత్రి, ఎంఎల్సీలపై సూమోటోగా హైకోర్టు తక్షణమే కేసులు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు.