గుంటూరు: ఆంధ్రప్రదేశ్  పంచాయితీ ఎన్నికలు ఏకపక్షంగా ప్రజాస్వామ్య విరుద్దంగా జరుగుతున్నాయని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు.ఆదివారం నాడు గుంటూరు జిల్లా రెంటచింతల, దాచేపల్లిలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.ప్రజాస్వామ్యంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి విశ్వాసం లేదన్నారు. సంక్షేమ పథకాలపై నమ్మకముంటే ఎందుకీ ఏకగ్రీవాలంటూ ఆయన ప్రశ్నించారు.

సరైన పద్దతిలో ఎన్నికలు జరిగితే ఓటమి తప్పదనే భయం వైఎస్ఆర్‌సీపీలో కన్పిస్తోందన్నారు.పోలీస్, రెవిన్యూ, పంచాయితీరాజ్ శాఖ అధికారులు, ఉద్యోగులు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు.

విపక్షాలకు చెందిన అభ్యర్ధులకు ధృవపత్రాలు కూడ అధికారులు ఇబ్బందులకు గురి చేశారని ఆయన విమర్శించారు.ఈ విషయాలపై తాము ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా కూడ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిణామాలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి  తీసుకెళ్తామని ఆయన చెప్పారు.

ఏపీ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ప్రభుత్వం తీరును  విపక్షాలు  తీవ్రంగా విమర్శిస్తున్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకొని వైఎస్ఆర్‌సీపీ  ఏకగ్రీవాలను చేయించిందని విపక్షాలు ఆరోపించాయి.