గన్నవరం విమానాశ్రయంలో సినీ హీరో శివాజీపై బీజేపీ కార్యకర్తలు చుట్టుముట్టారు. ఆయనను నిలదీసే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 

విజయవాడ: గన్నవరం విమానాశ్రయంలో సినీ హీరో శివాజీపై బీజేపీ కార్యకర్తలు చుట్టుముట్టారు. ఆయనను నిలదీసే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రధాని మోడీపై విమర్శలు చేయడాన్ని నిరసిస్తూ వారు శివాజీని నిలదీసేందుకు ప్రయత్నించారు.

తమ పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బుధవారం ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి వస్తున్న నేపథ్యంలో ఆయనకు స్వాగతం చెప్పేందుకు బిజెపి కార్యకర్తలు గన్నవరం విమానాశ్రయానికి వచ్చారు.

అదే సమయంలో విమానాశ్రయానికి హీరో శివాజీ వచ్చారు. ఆయనను బిజెపి కార్యకర్తలు చూసి అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శివాజీని ఘెరావ్ చేశారు.

శివాజీ కూడా వారితో ప్రత్యేక హోదా అంశంపై వాగ్వాదానికి దిగారు. తన ప్రాణం పోయేవరకు ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడుతూనే ఉంటానని శివాజీ చెప్పారు.

రంగంలోకి దిగిన పోలీసులు బీజేపీ కార్యకర్తలను అడ్డుకున్నారు. శివాజీని అక్కడి నుంచి సురక్షితంగా పంపించారు. శివాజీ గన్నవరం నుంచి హైదరాబాద్‌కు వెళ్లేందుకు విమానాశ్రయానికి వచ్చినట్లు సమాచారం.