ఆరోపణలు, విమర్శలపై మిత్రపక్షాల మధ్య సరిహద్దులు చెరిగిపోతున్నాయి. తాజాగా బిజెపి నేతలు చేస్తున్న ఆరోపణలే అందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి. చంద్రబాబునాయుడు, లోకేష్ వల్లే రాష్ట్ర విభజన జరిగిందంటూ బిజెపి నేతలు పెద్ద బాంబే పేల్చారు. ఏపి , తెలంగాణాలకు చంద్రబాబు, లోకేష్ సిఎంలు కావాలన్న స్వార్ధంతోనే చంద్రబాబు రాష్ట్ర విభజనకు సహకరించినట్లు బిజెపి నేతలు మండిపడ్డారు.

కమలం పార్టీ ప్రధాన కార్యదర్శులు జమ్ముల శ్యాం కిషోర్, సురేష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, నాలుగేళ్ళల్లో టిడిపి ఏనాడూ మిత్రధర్మాన్ని పాటించలేదన్నారు. కేంద్రం నుండి ఏపి అభివృద్ధికి చాలా నిధులే వచ్చయన్నారు. పోయిన ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా అమలు చేశారా అంటూ నిలదీయటం గమనార్హం.  రుణమాఫీ కాకపోవటంతో రైతుల్లో, నిరుద్యోగ భృతి ఇవ్వకపోవటంతో నిరుద్యోగుల్లో అసంతృప్తి పెరిగిపోతోందని ధ్వజమెత్తారు. కులాల మధ్య చిచ్చు పెట్టటం వల్ల మొత్తం ప్రజల్లోనే ప్రభుత్వంపై అసంతృప్తి పెరిగిపోయిందన్నారు. ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు కేంద్రంపై చంద్రబాబు నిందలేస్తున్నట్లు నేతలు మండిపడ్డారు.

కాంగ్రెస్ హయాంలో అవినీతికి పాల్పడ్డ వారే తర్వాత టిడిపిలో చేరి టిక్కెట్లు తెచ్చుకుని పార్లమెంటులో ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారంటూ ధ్వజమెత్తారు. గల్లా జయదేవ్ అవినీతిపై సిబిఐ కేసులున్నది వాస్తవం కాదా అంటూ నిలదీసారు. చంద్రబాబు రెండు కళ్ళ సిద్దాంతం వల్లే ఏపికి రావాల్సిన భద్రాద్రి రాముడు తెలంగాణాకు వెళ్ళిపోయినట్లు బిజెపి నేతలు మండిపడ్డారు.

తమతో గొడవ పెట్టుకుంటే నష్టపోయేది టిడిపినే అంటూ హెచ్చరించారు. టిడిపి యుద్ధానికి దిగితే తాము సిద్ధమేనన్నారు. ఇంతకాలం మోడి బ్రహ్మాండమని, కేంద్రం బాగా సహకరిస్తోందంటూ చెప్పిన చంద్రబాబు ఇపుడు ఎందుకు నిందలేస్తున్నారో చెప్పాలంటూ నిలదీసారు. వైసిపితో బిజెపి కలవటం సరికాదని అంటున్న టిడిపి నేతలు రాష్ట్ర బంద్ కు పిలిపిచ్చిన వామపక్షాలు, వైసిపి, కాంగ్రెస్ తో కలవచ్చా అంటూ ఎదురు ప్రశ్నించారు. మొత్తానికి బిజెపి నేతల వరస చూస్తుంటే టిడిపితో అమితుమి తేల్చుకునేందుకు సిద్ధపడినట్లు స్పష్టమవుతోంది.