చంద్రబాబునాయుడు భేష్ అంటూ గేట్స్ కితాబునిచ్చారు. మొన్నటి నవంబర్ లో విశాఖపట్నంలో వ్యవసాయరంగంపై అంతర్జాతీయ సదస్సు జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అందులో మైక్రోసాఫ్ట్ వ్యవస్ధాపకుడు బిల్ గేట్స్ పాల్గొన్నారు. తర్వాత అమెరికా వెళిపోయిన గేట్స్ నుండి చంద్రబాబుకు ఓ లేఖ అందింది తాజాగా. వ్యవసాయం-పౌష్టికాహారం, ఆరోగ్య అంశాలను సమ్మిళితం చేసి ప్రణాళిక రూపొందించాలన్న చంద్రబాబు ఆలోచన భేషుగ్గా ఉందంటూ తన లేఖలో గేట్స్ అభినందించారు. ఏపిలో 85 శాతం మందికి ఆరోగ్య బీమా కవరేజి ఉండటం ప్రశంసనీయమన్నారు.

వ్యవసాయరంగానికి సాంకేతికత జోడించటం, భూసార పరీక్షల మ్యాపింగ్, విలువ జోడింపు చెయిన్ల ఏర్పాటు తదితర అంశాలపై కలిసి పనిచేద్దామని తన లేఖలో గేట్స్ ప్రతిపాదించారు. ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ విధానాలను ఏపికి తెచ్చేందుకు ప్రయత్నిస్తామని కూడా హామీ ఇచ్చారు. అభివృద్ధిలో ఏపి మిగితా ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు.