Asianet News TeluguAsianet News Telugu

జోగి రమేష్ ఫోటోగ్రాఫర్ మిస్సింగ్ కేసులో బిగ్ ట్విస్ట్... సిసి ఫుటేజితో బండారం బయటపడింది...! (వీడియో)

ఆంధ్ర ప్రదేశ్ మంత్రి జోగి రమేష్ వ్యక్తిగత ఫోటోగ్రాఫర్ ఆదినారాయణ మిస్సింగ్ కేసులో అసలు ట్విస్ట్ బయటపడింది. ఈ ఆత్మహత్య వ్యవహారమంతా నాటకమని... పక్కా ప్లాన్ తో దీన్ని రక్తి కట్టించారని పోలీసులు భావిస్తున్నారు. 

Big twist on Minister Jogi Ramesh missing incident AKP
Author
First Published Sep 28, 2023, 1:57 PM IST

విజయవాడ : మంత్రి జోగి రమేష్ వ్యక్తిగత ఫోటోగ్రాఫర్ ఆదినారాయణ మిస్సింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ బయటపడింది. అప్పుల భారినుండి తప్పించుకునేందుకే అతడు ఆత్మహత్య నాటకం ఆడినట్లు పోలీసులు గుర్తించారు. ఆదినారాయణ కృష్ణా నదిలో దూకలేదని... తన బైక్, వస్తువులతో పాటు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లెటర్ పెట్టి ఎక్కడికో పరారయినట్లు పోలీసులు తేల్చారు. అతడు పరారవుతున్న దృశ్యాలు సిసి కెమెరాలకు చిక్కడంతో సూసైడ్ నాటకం బయటపడింది. 

ఇటీవల కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని ఉల్లిపాలెం-భవానిపురం వారధిపై మంత్రి జోగి రమేష్ స్టిక్కర్ ఓ బైక్ అనుమానాస్పదంగా నిలిపివుండటాన్ని పోలీసులు గుర్తించారు. బైక్ దగ్గరే సెల్ ఫోన్ తో పాటు కొన్ని వస్తువులు లభించారు. అక్కడే ఓ సూసైడ్ లెటర్ కూడా లభించింది. దీంతో మంత్రి జోగి రమేష్ వ్యక్తిగత ఫోటోగ్రాఫర్ యరగాని ఆదినారాయణ అప్పులబాధతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులతో సహా కుటుంబసభ్యులు భావించారు.  

అయితే  ఎస్డిఆర్ఎఫ్ బృందంతో పాటు పెడన, కోడూరు పోలీసులు రెండురోజులు గాలింపు చేపట్టిన ఆదినారాయణ మృతదేహం ఎక్కడా లభించలేదు. దీంతో అసలు అతడు ఆత్మహత్య చేసుకున్నాడా అన్న అనుమానం పోలీసులకు వచ్చి చుట్టుపక్కల ప్రాంతాల్లోని సిసి కెమెరాలను పరిశీలించారు. వారి అనుమానమే నిజమై అసలుసంగతి బయటపడింది. ఆత్మహత్య చేసుకున్నాడని భావిస్తున్న ఆదినారాయణ తాపీగా పారిపోతూ కనిపించడం చూసి పోలీసులు షాకయ్యారు. 

Read More  సూసైడ్ లెటర్ లో మంత్రి జోగి రమేష్ పేరు... పెడనలో ఫోటోగ్రాఫర్ మిస్సింగ్ కలకలం

పక్కా ప్లాన్ ప్రకారమే ఆదినారాయణ ఆత్మహత్య నాటకం ఆడినట్లు సిసి కెమెరా ఫుటేజిని బట్టి తెలుస్తోంది. ముందుగానే పారిపోవడానికి అన్ని సిద్దం చేసుకున్నాడు ఆదినారాయణ. సర్దుకున్న బ్యాగులను బైక్ కు తగిలించుకుని ఉల్లిపాలెం బ్రిడ్జివద్దకు  ఫోన్ మాట్లాడుకుంటూ హాయిగా నవ్వుకుంటూ చేరుకున్నాడు. అక్కడ బైక్ తో పాటు సూసైడ్ లెటర్ పెట్టి ఆటోఎక్కి వెళ్లిపోయాడు. ఇలా ఆటోలో కోడూరు గంగానమ్మ సెంటర్ వద్దకు చేరుకున్నాడు. ఎవరూ గుర్తుపట్టకుండా ముఖానికి మాస్క్, తలకు టోపీ పెట్టుకుని అతడు వెళుతుండటం సిసి కెమెరాలో రికార్డయ్యింది. అక్కడే కొద్దిసేపు ఎదురుచూసి ఓ ఆటో ఎక్కి వెళ్లిపోయాడు. 

సిసి ఫుటేజి వీడియో

ఇలా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అందరినీ నమ్మించేందుకు ఆదినారాయణ పక్కా ప్లాన్ వేసినా అడ్డంగా దొరికిపోయాడు. ఆదినారాయణ చనిపోలేదని....అలా అందరినీ నమ్మించి పరారయ్యాడని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. సూసైడ్ నోట్ లో పేర్కొన్నట్లు అప్పుల బారి నుండి తప్పించుకునేందుకే ఈ నాటకం ఆడినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు.అతడు ఎక్కడికి వెళ్లాడో తెలుసుకోడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 

అసలేం జరిగింది :

వివరాల్లోకి వెళితే... పెడన నియోజకర్గం కాకర్లపూడి శివారు ముత్రాస్ పాలెంకు చెందిన యరగాని ఆదినారాయణ ఫోటో గ్రాఫర్. చాలాకాలంగా ఇతడు స్థానిక ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి జోగి రమేష్ వద్ద వ్యక్తిగత ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. గతేడాదే ఇతడికి పెళ్లయ్యింది. అయితే భారీగా అప్పులుచేసిన ఇతడు వాటిని తిరిగి చెల్లించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ లెటర్ రాసి నాటకం ఆడాడు. 

ఉల్లిపాలెం-భవానిపురం వద్ద లభించిన సూసైడ్ లెటర్ ను బట్టి ఆర్థిక కష్టాల వల్లే ఆదినారాయణ ఆత్మహత్య చేసుకుని వుంటాడని పోలీసులు అనుమానించారు. సూసైడ్ లెటర్ లో ఆదినాయణ మంత్రి జోగి రమేష్ పేరును కూడా ప్రస్తావించాడు. ''ఐదున్నరేళ్లుగా మీతోనే వున్నాను... అందుకుగాను నాకు, నా కుటుంబానికి చాలా సహాయం చేసారు. అయితే నాకు అవగాహన లేకుండా చేసిన కొన్ని పనులతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. అందువల్లే ఆత్మహత్య చేసుకుంటున్నాను. దయచేసి నా కుటుంబానికి ఇకపైనా అండగగా ఉండాలని... నా భార్యకు ఏదయినా మంచి ఉద్యోగం ఇప్పించడం. మీనుండి సెలవు తీసుకుంటున్నా'' అంటూ మంత్రి జోగి రమేష్ ను కోరాడు ఆదినారాయణ. 

ఇక ఈ సూసైడ్ లెటర్ లో తన ఆత్మహత్యకు గల కారణాలివే అంటూ కుటుంబసభ్యులకు వివరించాడు ఆదినారాయణ.  తన గురించి ఆలోచించి తండ్రి ఆరోగ్యం క్షీణిస్తోంది.. . ఆయనను ఇలా చూస్తూ బ్రతకాలని అనిపించడం లేదని పేర్కొన్నారు.అమ్మానాన్నలను జాగ్రత్తగా చూసుకోవాలని సోదరుడికి సూచించాడు. తనకు ఏ దారి లేక ఆత్మహత్య చేసుకుంటున్నానని... ఇది తప్పని తెలిసిన తప్పడం లేదని అన్నాడు. అప్పులిచ్చిన వారిలో కొందరికయినా న్యాయం చేయాలని ఇన్నాళ్లు బ్రతికాను... ఇక బ్రతకలేకపోతున్నా అని పేర్కొన్నాడు. తన అప్పులతో కుటుంబసభ్యులకు ఎలాంటి సంబంధం లేదని ఆదినారాయణ పేర్కొన్నారు.తాను ఆత్మహత్య చేసుకున్నా మృతదేహం దొరకకుండా చూసుకుంటానని... ఒకవేళ దొరికినా స్వగ్రామానికి తీసుకెళ్లవద్దంటూ కోరాడు. 

ఇలా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు నాటకమాడిన ఆదినారాయణ మంత్రి జోగి రమేష్ కు సన్నిహితుడు కావడంతో పోలీసులు కూడా ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నాడు. అతడి కోసం రెండు రోజులపాటు గాలించారు. చివరకు ఇదంతా నాటకమని తెలిసి షాక్ కు గురయ్యారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios