ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్టూరి వీరప్రసాద్(పీవీపీ) కి హైకోర్టులో ఊరట లభించింది. ఒక విల్లాకు సంబంధించిన కేసులో ఆయన ఈ ఊరట లభించడం గమనార్హం. పిటిషనర్‌ను అరెస్టు చేయవద్దని హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఈనెల 14వరకు పొడిగించింది. ఈ వ్యాజ్యంలో కోర్టు పరిశీలనకు ఇచ్చిన సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులలోని ప్రధానాంశాలను ఈనెల 7లోగా కోర్టు ముందుంచాలని అన్ని పక్షాల న్యాయవాదులను ఆదేశించింది. 

కేసులో ముందస్తు బెయిలు కోరుతూ పీవీపీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం గురువారం మరోసారి విచారణకు వచ్చింది. ఒకే కేసులో పిటిషనర్‌ ముందస్తు బెయిలు సహా మూడు వ్యాజ్యాలు దాఖలు చేశారని ఫిర్యాదీ తరఫున సీనియర్‌ న్యాయవాది టి. నిరంజన్‌రెడ్డి కోర్టుకు తెలిపారు. ముందస్తు బెయిలు వ్యాజ్యానికి విచారణార్హత లేదన్నారు. 

క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేసిన పీవీపీ తరఫున సీనియర్‌ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదించారు. పీవీపీ ముందస్తు బెయిలు పిటిషన్‌లో సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదించారు. ఈ వ్యాజ్యానికి విచారణార్హత ఉందని చెప్పారు. వాదనలు విన్న హైకోర్టు జడ్జి గతంలో ఇచ్చిన ఆదేశాలను పొడిగించారు. పీవీపీని ఈనెల 14వరకు ఆరెస్టు చేయరాదని ఆదేశించారు.