అటు ఫిరాయింపు ఎంఎల్ఏలు, ఇటు నియోజకవర్గాల ఇన్ ఛార్జిలు తమ భవిష్యత్తుపై ఆందోళనలో ఉన్నారు.

ఫిరాయింపు శాసనసభ్యుల ఆశలపై కేంద్రప్రభుత్వం నీళ్ళు చల్లినట్లే. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రతిపక్షాల నుండి సుమారు 50 మంది దాకా ఎంఎల్ఏలు అధికార పార్టీల్లోకి ఫిరాయించారు. ఒకవిధంగా అధికార పార్టీలే పై ఎంఎల్ఏలతో బలవంతంగా పార్టీలు మారేట్లు చేసాయి. ఫిరాయింపులను ప్రోత్సహించే క్రమంలో పై నియోజకవర్గాల్లోని నేతలతో వివాదాలు రాకుండా వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల సంఖ్య పెరుగనున్నందున ఎవరికీ ఇబ్బందులుండవని ముఖ్యమంత్రులు చంద్రబాబునాయడు, కెసిఆర్ చెబుతూ వస్తున్నారు.

అయితే, వివిధ వేదికలపై రెండు రాష్ట్రాల్లోనూ నియోజకవర్గాల సంఖ్య పెరగదని కేంద్రప్రభుత్వం కూడా చెబుతూనే ఉంది. అయినా సరే తాము ప్రయత్నాలు చేస్తున్నామని నియోజకవర్గాల సంఖ్య పెరుగుతాయంటూ ఇద్దరు ముఖ్యమంత్రులూ ఇంతకాలం నమ్మబలుకుతున్నారు.

ఈ నేపధ్యంలోనే బుధవారం జరిగిన రాజ్యసభ సమావేశాల్లో భాగంగా టిడిపి ఎంపి టిజి వెంకటేష్ వేసిన ఓ ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్సరాజ్ సమాధానమిస్తూ 2026 వరకూ నియోజకవర్గాల పెంపు సాధ్యం కాదని తేల్చిచెప్పారు. దాంతో ఇంత కాలం ఇద్దరు సిఎంలు చెబుతున్న వన్నీ ఉత్త మాటలేనని తేలిపోయింది.

తాజాగా కేంద్ర మంత్రి తేల్చిచెప్పటంతో అటు ఫిరాయింపు ఎంఎల్ఏలు, ఇటు నియోజకవర్గాల ఇన్ ఛార్జిలు తమ భవిష్యత్తుపై ఆందోళనలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో చివరకు ఎవరికి టిక్కెట్లు దొరుకుతుందో కాలమే సమాధానం చెప్పాలి.