కోర్టులో చంద్రబాబును కలిసి కన్నీటి పర్యంతమైన భువనేశ్వరి
టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ఎసిబి కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించిన నేపథ్యంలో ఆయన సతీమణి భువనేశ్వరి కన్నీటి పర్యంతమయ్యారు. చంద్రబాబును కలిసి మాట్లాడారు.

విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఆయన సతీమణి నారా భువనేశ్వరి కలిశారు. చంద్రబాబుతో మాట్లాడారు. ఈ సమయంలో భువనేశ్వరి కన్నీటి పర్యంతమయ్యారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుకు ఎసిబి కోర్టు ఈ నెల 22వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.
రిమాండ్ విధిస్తూ కోర్ట్ తీర్పు ఇచ్చిన తర్వాత చంద్రబాబును కలిసేందుకు ఉండవల్లి నుంచి భువనేశ్వరి , ఇతర కుటుంబ సభ్యులు ఏసీబీ కోర్టు హాల్‌కు వచ్చారు. సరిగ్గా వివాహ వార్షికోత్సవం రోజున చంద్రబాబును జైలుకు తరలిస్తుడటంతో టీడీపీ శ్రేణులు కలత చెందుతున్నాయి. చంద్రబాబుకు రిమాండ్ విధించారని తెలిసి కుటుంబ సభ్యులు సైతం నిర్వేదంలో ఉన్నారు. రిమాండ్ తిరస్కరిస్తారని టీడీపీ నేతలు, కార్యకర్తలు తొలుత భావించారు. కానీ న్యాయస్థానం రిమాండ్ విధించడంతో కుటుంబ సభ్యుల్లోనూ ఆయన ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. కోర్టులో చంద్రబాబును చూసిన వెంటనే భువనేశ్వరితోపాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా భావోద్వేగానికి గురయ్యారు.
జైలులో అన్ని సదుపాయాలు ఉన్న గదిని కేటాయించాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. చంద్రబాబును జైలులో ఉంచడానికి బదులు హౌస్ అరెస్టులో ఉంచాలని ఆయన తరఫు న్యాయవాదులు కోరారు. అందుకు కోర్టు నిరాకరించింది. ఇంటి భోజనం, మెడిసిన్ ఆయనకు అందుబాటులో ఉంచాలని కూడా న్యాయవాదులు కోరారు.
చంద్రబాబును అధికారులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు. అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. చంద్రబాబు అరెస్టు విషయంలో దాదాపు 8 గంటల పాటు వాదనలు జరిగాయి. చంద్రబాబును అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ టిడిపి రేపు సోమవారం బంద్ తలపెట్టింది.
రాష్ట్రవ్యాప్తంగా 144వ సెక్షన్ విధించారు. అనుమతి లేకుండా ఏ విధమైన ర్యాలీలు, సభలు నిర్వహించకూడదని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబును జైలుకు తరలిస్తున్నందు వల్ల విజయవాడ నుంచి రాజమండ్రి వరకు మార్గాన్ని పోలీసులు క్లియర్ చేశారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. దారి వెంట పెద్ద యెత్తున బలగాలను మోహరించారు.