జనసేన నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను చూస్కుని రెచ్చిపోతున్నారని భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ మండిపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం మత్స్యపురిలో గురువారం రాత్రి జనసేన, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణతో ఉద్రిక్తత నెలకొంది.

ఈ నేపథ్యంలో భీమవరంలో శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. పవన్ కల్యాన్ సినిమాల్లో రకరకాల వేషాలు వేస్తారు. వాటిని నమ్మే స్థితిలో ప్రజలు లేరు. ఎన్నికలకు ముందు, తర్వాత కూడా మేమెంతో ఓర్పుగా ఉన్నామో ప్రజలు చూశారు. పార్టీ నాయకుడి తీరును బట్టే కార్యకర్తలు ఉంటారు. దీనికి జనసైనికుల తీరే నిదర్శనం.

మత్స్యపురిలో దళిత మహిళను సజీవదహనం చేయాలని, దళితుల ఇళ్లను తగల బెట్టాలని చూశారు. పరిస్థితిని సమీక్షించేందుకు వెళ్లిన నా మీద దాడికి ప్రయత్నించారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలమీద దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం, పోలీసుల తీరూ జనసేనకు మద్దతిస్తున్నట్లుగా ఉంది.. అని ఆరోపించారు. 

గురువారం రాత్రి మత్స్యపురిలో ఉద్రిక్తత గురించి తెలుసుకున్న ఎమ్మెల్యే అక్కడకు వెళ్లారు. దాడులు చేసిన వారినిి 24 గంటల్లోగా అరెస్ట్ చేయకపోతే చలో మత్స్యపురి నిర్వహిస్తాం అన్నారు. 

అసలు మత్స్యపురిలో ఏం జరిగిందంటే.. మత్స్యపురి సర్పంచ్ గా తమ పార్టీ మద్దతుతో కారేపల్లి శాంతిప్రియ గెలిచారని చెబుతూ జనసేన నాయకులు గురువారం విజయోత్సవ ర్యాలీ చేశారు. వారు బాణసంచా కాల్చడంతో నిప్పురవ్వలు ఒక తాటాకు ఇంటిమీద పడి మంటలు చెలరేగాయి. 

పక్కనే ఉన్న దివ్యాంగురాలిపై కూడా నిప్పురవ్వలు పడ్డాయి. వెంటనే జనసేన కార్యకర్తలు మంటలు ఆర్పేశారు. ఆ తరువాత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసేందుకు వెళ్లారు. అక్కడ జనసేన, వైసీపీ మద్దతుదారుల మధ్య వివాదం చెలరేగింది. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, వైసీపీ నాయకులు వచ్చి కార్యకర్తలకు మద్ధతుగా నిలిచారు. 

ఎమ్మెల్యే వెంట వచ్చినవారు తమ కార్యకర్తల, వార్డు సభ్యుల ఇల్లు, వాహనాలపై దాడి చేశారని జనసేన నాయకులు ఆరోపించారు. పోలీసులు గ్రామంలో 144 సెక్షన్ విధించారు. దళితుల ఇళ్లకు నిప్పుపెట్టిన జనసేన కార్యకర్తలు, నాయకులపై కేసులు నమోదు చేయాలంటూ వైసీపీ, దళిత నాయకులు మత్స్యపురిలో శుక్రవారం దీక్ష చేశారు. నరసాపురం-భీమవరం రహదారిపై బైఠాయించారు.