గుంటూరు: రోజురోజుకు మానవ సంబంధాలు మంటకలిసిపోతున్నాయి. కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లిని ఆస్తికోసం కాటికి పంపిందో కఠినాత్మురాలు. నవమాసాలు మోసి కనిపెంచిన తల్లి అని కూడా చూడకుండా ఆస్తికోసం అత్యంత కృరంగా ప్రవర్తించింది. 

ఈ విషాదఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. తన తల్లి ఆలపాటి లక్ష్మి మరణిస్తేనే ఆస్తి తనకు దక్కుతుందని భావించిన భార్గవి అనే మహిళ తన భర్త సాయంతో కన్న తల్లిని మట్టుబెట్టింది. భర్త, బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టింది. 

ఆలపాటి లక్ష్మి హత్యకు గురవ్వడంతో ఆమె మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టంకు తరలించారు. అయితే కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ మెుదలపెట్టగా భార్గవి అడ్డు చెప్పింది. తమకు ఎవరూ శత్రువులు లేరని కేసు వద్దని పోలీసుల విచారణను అడ్డుకునే ప్రయత్నం చేసింది. 

భార్గవి కేసు పెట్టవద్దని కోరడంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అనంతరం పోస్టుమార్టం నివేదికను ఆధారంగా చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. కుమార్తె భార్గవిని తమదైన శైలిలో పోలీసులు విచారించగా వాస్తవాలు వెల్లడించారు. 

ఆలపాటి లక్ష్మిని కుమార్తె భార్గవి కాళ్లుపట్టుకోగా అల్లుడు, ఆమె బాయ్ ఫ్రెండ్ ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు అంగీకరించారని పోలీసులు స్పష్టం చేశారు. ఆలపాటి లక్ష్మి ఆస్తిపై కుమార్తె భార్గవి ఎప్పటి నుంచో కన్నేసిందని తెలిపారు. 

ఆలపాటి లక్ష్మి భర్త ఇటీవలే మరణించడంతో ఆమె ఒంటరిగా ఉంటుంది. ఈ నేపథ్యంలో పలుమార్లు భార్గవి వచ్చి తల్లితో ఆస్తికోసం నిత్యం గొడవపెట్టుకునేదని పోలీసుల విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.   

తల్లి కుమార్తె పేరిట ఆస్తి రాసేందుకు అంగీకరించకపోవడంతో తల్లిని అంతమెుందించాలని భార్గవి స్కెచ్ వేసింది. ఈనెల 10న ఆలపాటి లక్ష్మిని కుమార్తె భార్గవి తన భర్త, బాయ్ ఫ్రెండ్ తో కలిసి హత్య చేయించింది. 

హత్యకు ప్లాన్ వేసిన కుమార్తె భార్గవి, ఆమె భర్తతోపాటు సహకరించిన బాయ్ ఫ్రెండ్ ను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.7వేలు నగదు, 3సెల్ ఫోన్లు, గోల్డ్ చైన్ ను స్వాధీనం చేసుకున్నారు గుంటూరు పోలీసులు. 

ఇకపోతే హైదరాబాద్ లోని హయత్ నగర్ లో ఇలాంటి దారుణమే చోటు చేసుకుంది. రూ.10 లక్షల కోసం కన్నతల్లి రజితను ప్రియుడితో కలిసి అత్యంత దారుణంగా హత్య చేసింది కుమార్తె కీర్తి. ఈ దారుణమైన ఘటనలో నిందితులను అరెస్ట్ చేసే లోపు  గుంటూరులో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. 
 
మెుత్తానికి తెలుగు రాష్ట్రాల్లో తల్లులు పాలిట కుమార్తెలు యముడిగా మారారు. తమకు ప్రాణం పోసిన కన్న తల్లులను ఆస్తికోసం అత్యంత కిరాతకంగా హత్య చేస్తున్నారు. హైదరాబాద్ లోని కీర్తి ఉదంతం మరవకముందే గుంటూరులో మరో దారుణం వెలుగులోకి రావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. 
 

ఈ వార్తలు కూడా చదవండి

తల్లి రజితను చంపిన కీర్తి: దృశ్యం సినిమాకు రెండో వెర్షన్

హైదరాబాద్‌లో దారుణం...పురిటిబిడ్డ బ్రతికుండగానే పూడ్చిపెట్టే ప్రయత్నం