నగరి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నికల వేడి అప్పుడే మెుదలైనట్లు కనబడుతోంది. ముఖ్యంగా నగరి నియోజకవర్గంలో నువ్వా నేనా అన్న రీతిలో ఎన్నికల సమరానికి రెడీ అవుతున్నారు అభ్యర్థులు. టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దు కృష్ణమ నాయుడు ఇంటిలో సీట్ల లొల్లి ఓ కొలిక్కి రావడంతో రాజకీయ పోరుకు తెరలేపినట్లు అర్థమవుతుంది. 

తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గాలి తనయుడు భాను ప్రకాష్ అభ్యర్థిత్వం దాదాపు ఖరారు కావడంతో రోజా తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇప్పటికే తనదైన శైలిలో ప్రజల్లోకి చొచ్చుకుపోతున్నారు. 

ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభ నిధులతో నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన రోజా తాజాగా వైఎస్ఆర్ క్యాంటీన్ పథకానికి శ్రీకారం చుట్టారు. రూ.4కే భోజనం పెడుతూ అందరి మన్నలను పొందుతున్నారు. 

వైఎస్ఆర్ క్యాంటీన్ ప్రవేశపెట్టి నెలరోజుల కాకముందే తాగునీటి సమస్య రాకుండా ఉండేందుకు మరో పథకానికి శ్రీకారం చుట్టారు. రూ.2కే 20 లీటర్లు మినరల్ వాటర్ ఇచ్చే పథకానికి రూపకల్పన చేశారు. కార్యకర్తలతో నిత్యం అందుబాటులో ఉండేందుకు మెుబైల్ యాప్ ను సైతం క్రియేట్ చేశారు రోజా.  

ఇప్పటికే గడపగడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రావాలి జగన్, కావాలి జగన్ వంటి కార్యక్రమాలతో నగరి నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు రోజా. వివిధ వినూత్న కార్యక్రమాలతో నిత్యం కార్యకర్తలతో ఉంటూ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టేశారు. 

మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఇప్పటికే 30 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. అందులో నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే రోజా పేరు ముందు ఉంది. టిక్కెట్ కన్ఫమ్ కావడంతో ఆమె తన వ్యూహాలకు పదును పెట్టి ప్రజల్లో దూసుకుపోతున్నారు. 

మరోవైపు భాను ప్రకాష్ సైతం తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ హోదాలో ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ తన అభ్యర్థిత్వాన్ని బలపరచాలంటూ దూసుకెళ్లిపోతున్నాడు. అటు తల్లి ఎమ్మెల్సీ సరస్వతి సైతం ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. 

ఒకవైపు టీడీపీ అభ్యర్థిగా భాను ప్రకాష్, వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్.కే రోజా ఎవరికి వారు తమ తమ వ్యూహాలకు పదును పెడుతుండటంతో అప్పుడే నగరి నియోజకవర్గంలో ఎన్నికల సమరాన్ని తలపిస్తోంది. 

అయితే భాను ప్రకాష్ తానే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని అంటూ చెప్పుకుంటున్నారు. కానీ ఆయన అభ్యర్థిత్వంపై కుటుంబ సభ్యులు మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. అందుకు గాలి కుటుంబంలో నెలకొన్న సీటు చిచ్చే అందుకు కారణమని తెలుస్తోంది. 

గాలి ముద్దు కృష్ణమ నాయుడు కొంపలో చిచ్చుపెట్టిన టిక్కెట్ వ్యహారాన్ని ఓ సారి చూద్దాం. రాయలసీమ రాజకీయాల్లోప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు గాలి ముద్దు కృష్ణమ నాయుడు. తెలుగుదేశం పార్టీ కంచుకంఠంగా పిలిచే ఆయన విపక్షాలకు తనదైన శైలిలో చెక్ పెట్టేవారు. 2014 ఎన్నికల్లో ఆర్కే రోజా చేతిలో పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ అయ్యారు. అనారోగ్యం కారణంగా ఇటీవలే మరణించారు. 

గాలి ముద్దు కృష్ణమ మరణంతో అయన భార్య సరస్వతికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు సీఎం చంద్రబాబు. అంతేకాదు నగరి టిక్కెట్ వారి కుటుంబానికే కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. చంద్రబాబు నాయుడు ప్రకటనతో నగరి టిక్కెట్ పై గాలి తనయుల మధ్య వర్గ పోరు మెుదలైంది. అన్నదమ్ములు జగదీష్, భానుప్రకాష్ లు పోటీపడుతున్నారు. 

వాస్తవానికి గాలి ముద్దుకృష్ణమ నాయుడు తన పెద్ద కుమారుడు భాను ప్రకాష్ ను తన రాజకీయ వారసుడిగా పరిచయం చేశారు. తండ్రి రాజకీయాల్లో బిజీగా ఉండటంతో భాను ప్రకాష్ ప్రత్యేకంగా కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉండేవారు. 

గాలి ముద్దు కృష్ణమ నాయుడు మరణం అనంతరం సరస్వతమ్మ తన చిన్నకుమారుడు జగదీష్ ను రాజకీయాల్లోకి దించాలని ప్రయత్నిస్తున్నారు. నగరి టిక్కెట్ జగదీష్ కు అంటూ ఆమె ప్రకటించారు కూడా. తండ్రి తనను రాజకీయ వారసుడిగా ప్రకటిస్తే తల్లి తన సోదరుడిని ప్రకటించడాన్ని భాను ప్రకాశ్ తట్టుకోలేకపోయారు.

దీంతో అన్నదమ్ముల మధ్య సీటు కోసం పోరు మెుదలైంది. గాలి ముద్దు కృష్ణమ బ్రతికున్నంతకాలం గడపదాటని గాలి ఫ్యామిలీ రాజకీయాలు గడప దాటి రోడ్డెక్కాయి. అన్నదమ్ముల మధ్య వర్గపోరు ఏకంగా సీఎం చంద్రబాబు దృష్టి వరకు వెళ్లాయి. 

నగరి టిక్కెట్ పై గాలి ముద్దు కృష్ణమ తనయులు ఎవరికి వారు ప్రయత్నాలు చేపట్టడం గ్రూపు రాజకీయాలు చేస్తుండటంతో పార్టీ కార్యకర్తల్లో ఆందోళన చెలరేగింది. పార్టీకి ఇబ్బంది కర పరిస్థితి నెలకొనడంతో అక్టోబర్ నెలలో సీఎం చంద్రబాబు సీటు పంచాయితీపై చర్చించేందుకు గాలి ఫ్యామిలీని అమరావతికి పిలిపించారు. 

గాలి ముద్దు కృష్ణమ నాయుడు భార్య ఎమ్మెల్సీ సరస్వతీ, తనయులు భాను ప్రకాష్, జగదీష్ లతో సమావేశమయ్యారు. నగరి టిక్కెట్ మీ కుటుంబానికే ఇస్తానని హామీ ఇచ్చానని అయితే ఎవరికి ఇవ్వాలో తేల్చుకోవాలంటూ ఫైనల్ నిర్ణయం అన్నదమ్ములకే వదిలేశారు. 

చంద్రబాబు నిర్ణయంపై గాలి కుటుంబం విస్తృతంగా చర్చించింది. అన్నదమ్ములిద్దరూ ఏకమైనట్లు చంద్రబాబుకు స్పష్టం చేశారు. తమలో ఎవరికి టిక్కెట్ ఇచ్చినా వారి విజయానికి కృషి చేస్తామని అంగీకారానికి వచ్చారు. 

అయితే కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాత భాను ప్రకాష్ అభ్యర్థిత్వాన్ని తల్లి సరస్వతి, సోదరుడు జగదీష్ అంగీకరించినట్లు తెలుస్తోంది. దీంతో భాను ప్రకాష్ ఎన్నికల ప్రచారానికి అప్పుడే శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా భాను ప్రకాష్ ఎన్నికల ప్రచారాన్ని స్టార్ట్ చేశారు. 

అలాగే పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు పెట్టించి హడావిడి చేస్తున్నారు. అయితే సోదరుడు జగదీష్ మాత్రం అంతగా రాజకీయాల జోలికి రావడం లేదు. దీంతో ఇంకా కుటుంబంలో సీటు చిచ్చు ఆరలేదని ప్రచారం జరుగుతుంది. 

ఒకవేళ అన్నదమ్ముల మధ్య టిక్కెట్ వార్ క్లియర్ కాకపోతే గాలి కుటుంబానికి ఎసరుపెట్టే అవకాశాలు ఉన్నాయి. మూడో వ్యక్తి వచ్చి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఒకవేళ భానుప్రకాష్ బరిలోకి దిగినా జగదీష్ అతని తల్లి సరస్వతి సహకరించకపోతే ఆ అసంతృప్తిని క్యాష్ చేసుకునేందుకు ఎమ్మెల్యే రోజా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

ఈ వార్తలు కూడా చదవండి

రూ.4కే భోజనం, రూ.2కే 20 లీటర్ల మినరల్ వాటర్ : నగరిలో రోజా సేవలు

ఎమ్మెల్యే రోజా ఉదారత:రూ.4లకే భోజనం

స్పీడ్ పెంచిన రోజా, నగరిలోనే మకాం