Asianet News TeluguAsianet News Telugu

స్పీడ్ పెంచిన రోజా, నగరిలోనే మకాం

ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ ఎవరంటే ప్రతీ ఒక్కరూ టక్కున చెప్పేది ఎమ్మెల్యే రోజా. తన మాటల తూటాలతో అధికార పార్టీని ఇరుకున పెట్టడమే కాదు ప్రజల దృష్టిని ఆకర్షించగల నేర్పరిగా ప్రజలు చెప్తుంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ సమస్యపై అయినా అనర్గళంగా మాట్లాడగలిగే నాయకుల్లో రోజా ముందు వరుసలో ఉంటారని రాజకీయ వర్గాల్లో టాక్. 

ycp mla roja jet speed in nagari constituency
Author
Nagari, First Published Dec 8, 2018, 6:43 PM IST

చిత్తూరు: ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ ఎవరంటే ప్రతీ ఒక్కరూ టక్కున చెప్పేది ఎమ్మెల్యే రోజా. తన మాటల తూటాలతో అధికార పార్టీని ఇరుకున పెట్టడమే కాదు ప్రజల దృష్టిని ఆకర్షించగల నేర్పరిగా ప్రజలు చెప్తుంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ సమస్యపై అయినా అనర్గళంగా మాట్లాడగలిగే నాయకుల్లో రోజా ముందు వరుసలో ఉంటారని రాజకీయ వర్గాల్లో టాక్. 

ఏదైనా బహిరంగ సభల్లో కానీ, సమావేశాల్లో కానీ రోజా హాజరయ్యారంటే ఆరోజు ఏదో ఒక అలజడి. ఏదో ఒక విషయంపై అధికార పార్టీని కడిగేస్తారని అంతా ఆతృతగా ఎదురుచూస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ రోజూ ఏదో ఒక పార్టీకి మూడిందనే చెప్పుకోవాలి అంటుంటారు వైసీపీ నేతలు. అందుకే ఆమెను ఫైర్ బ్రాండ్ గా పిలుస్తారని చెప్తుంటారు.  

ఇక అసెంబ్లీలో అయితే చెప్పుకోనవసరం లేదు. అసెంబ్లీకి రోజా వచ్చారంటే ఆ రోజు అధికార పార్టీని కడిగేస్తారంటూ ఆమె అభిమానులు చెప్తుంటారు. ఆమె హావ భావాలతోనో, సైగలతోనో అధికార పార్టీపై చేసే విమర్శల గురించి అయితే చెప్పుకోనక్కర్లేదని ప్రచారం. రోజా ఉన్నప్పుడు అసెంబ్లీ వేరు రోజా లేని అసెంబ్లీ వేరు అంటూ చెప్పుకుంటారు రాజకీయ విశ్లేషకులు.  

మరి పొలిటికల్ ఫైర్ బ్రాండ్ అయిన రోజా 2019 ఎన్నికల సమరానికి సిద్ధమౌతున్నట్లు గా కనిపిస్తున్నారు. అన్ని పార్టీల కంటే ముందే రోజా వివిధ కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ముఖ్యంగా లోకల్ లో ఉండటం లేదన్న విమర్శలకు చెక్ పెడుతూ నగరిలోనే కొత్త ఇంటిని నిర్మించుకుని అక్కడే ఉంటున్నారు. 

ఇక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నగరి నియోజకవర్గంలో తిష్ట వేసేశారు. తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయిన నగరి నియోజకవర్గంలో మళ్లీ వైసీపీ జెండా ఎగురవెయ్యాలని మాంచి కసితో ఉన్నారు. 

అందులోనూ చిత్తూరు జిల్లా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా కావడంతో ఆ జిల్లాలో మళ్లీ గెలుపొందాలని ఉవ్విళ్లూరుతున్నారు ఎమ్మెల్యే ఆర్కే రోజా. అయితే రోజాకు ఉన్న అనుకూల ప్రతికూల పరిస్థితులు ఓ సారి చూద్దాం. 

వాస్తవానికి నగరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని చెప్పాలి. టీడీపీ సీనియర్ నేత దివంగత గాలి ముద్దుకృష్ణ‌మ‌నాయుడు అడ్డా అది. తెలుగుదేశం పార్టీలో చిత్తశుద్ధికలిగిన నాయకుడిగా ఆయనకు మంచి పేరు ఉంది. అలాంటి వ్యక్తిని రోజా 2014 ఎన్నికల్లో ఓడించారు. తొలిసారిగా వైసీపీ జెండా ఎగురవేశారు. అయితే ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షానికే పరిమితం కావాల్సి వచ్చింది. 

తెలుగుదేశం పార్టీ కంచుకోట కావడం, ఆ పార్టీయే అధికారంలో ఉండటంతో గాలి కుటుంబమే హవా ఉండేది. గాలి చెప్పిందే వేదంగా ప్రజాప్రతినిధులు అధికారులు పనిచేసేవారని రోజా నిత్యం విమర్శలు చేస్తుండేవారు. ఇటీవలే గాలి ముద్దు కృష్ణమ నాయుడు తనయులు నగరి నియోజకవర్గంలో ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని నిలదీశారు. 

ఎమ్మెల్సీ సరస్వతినా లేక తనయుడా అంటూ ప్రశ్నించారు. అంతేకాదు తాను ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేని కాబట్టి తనకు చంద్రబాబు నిధులు ఇవ్వడం లేదంటూ పదేపదే విమర్శించేవారు. ఇదే విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లారు.

ఇకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ పిలుపునిచ్చినా ఏ కార్యక్రమం చేపట్టినా రోజా తన నియోజకవర్గమైన నగరిలో అట్టహాసంగా చేపట్టేవారు. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన గడపగడపకు వైఎస్ఆర్సీపీ, రావాలి జగన్, కావాలి జగన్ వంటి కార్యక్రమాలతో ప్రజల్లోకి బాగా దూసుకుపోయారు. 

ఇకపోతే రోజా స్థానికంగా ఉండరంటూ అధికార పార్టీ విమర్శల దాడి చేసేది. రోజా స్థానికురాలు కాదని ఆమె లోకల్ గా ఉండరంటూ పదేపదే విమర్శించేవారు. టీడీపీ నేతల విమర్శలకు సైతం రోజా చెక్ పెట్టారు. 

న‌గ‌రిలో సొంతగా ఇళ్లు నిర్మించుకుని అక్కడే ఉంటున్నారు. వారంలో నాలుగు రోజులపాటు నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఇకపోతే నగరిలో ఇల్లు కట్టుకున్న తర్వాత రోజా తన రాజకీయాలకు పదును పెట్టారు. 

నియోజకవర్గ సమస్యలపై దృష్టి సారించారు. ఏ స‌మ‌స్య‌పైనైనా ప్ర‌భుత్వంతో పోరాడుతున్నారు. అధికారుల‌తో కొట్లాడి మరీ పనులు చేయించుకుంటున్నారు. ఇక సోషల్ మీడియాను సైతం రోజా బాగా ఉపయోగించుకుంటున్నారు. వాట్సప్, ఫేస్ బుక్, యాప్ లతో దూసుకుపోతున్నారు. 

ఇటీవలే రోజా తన పేరుతో ఓ మెుబైల్ యాప్ ను కూడా రూపొందించారు. ప్రజలు ఏ సమస్య వచ్చినా ఈ యాప్ లో ఫిర్యాదు చేసిన 24 గంటల్లో వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 

ఆ యాప్ ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు కార్యకర్తలు. ఇకపోతే ఫేస్ బుక్ లో సైతం రోజా సెల్వమణి అనే పేరుతో పార్టీ కార్యక్రమాలను వివరిస్తూ తన అభిప్రాయాలను కార్యకర్తలు అభిమానులతో పంచుకుంటున్నారు.  

ఇదిలా ఉంటే తన జన్మదినం నవంబర్ 17న ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు రోజా. అధికార పార్టీ రూ.5కి అన్న క్యాంటీన్ పేరుతో భోజనాలు పెడుతుంటే రోజా మాత్రం వైఎస్ఆర్ కాంటీన్ పేరుతో కేవలం రూ.4కే భోజనం పెడుతున్నారు. 

ఇలా వరుస కార్యక్రమాలతో దూసుకుపోతున్నారు రోజా. అంతేకాదు వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఎంపీ నిధులతో నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు కూడా. 

ఇకపోతే నగరి నియోకజవర్గంలో రోజా దూకుడుపై ప్రత్యేక చర్చ జరుగుతుంది. వారంలో మూడు రోజులపాటు నియోజకవర్గంలోనే ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. రోజా వ్యూహాలు చూస్తుంటే 2019 ఎన్నికలకు ప్రణాళికలు రెడీ చేసుకుంటున్నారని అంతా గుసగులాడుకుంటున్నారు. ఇకపోతే గాలి ఫ్యామిలీలో రాజకీయాలు ఆమెకు బాగా కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios