తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ కూర్పుపై జరుగుతున్న కసరత్తులో కొత్త పేర్లు బయటకు వస్తున్నాయి. ఎవరైతే అధ్యక్షరేసుకి ఎవరైతే సరిపోతారో పరిశీలించేందుకు పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. 

తాజాగా నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్ర పేరు రాష్ట్ర అధ్యక్ష పదవికి, దివంగత నేత కె.ఎర్రన్నాయుడి కుమారుడు, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడి పేరు తెలుగు యువత అధ్యక్ష పదవికి పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ మంత్రి కిమిడి కళావెంకట్రావు ఉన్నారు. ఆయన స్థానంలో ఎర్రన్నాయుడి తమ్ముడు, ప్రస్తుత టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడి పేరు ఇప్పటికే ప్రచారంలోకి వచ్చింది. సీనియర్ల బదులు యువ నేతలను ఈ పదవులకు ఎంపిక చేస్తే ఉత్సాహంగా తిరుగుతారని.. పార్టీ కార్యక్రమాల్లో కదలిక వస్తుందని కొందరు సీనియర్లు చంద్రబాబు వద్ద ప్రతిపాదించారు. ఈ కోణంలోనే రవిచంద్ర పేరు పరిశీలనకు వచ్చింది.

తెలుగు యువత అధ్యక్ష పదవి చేపట్టడానికి రామ్మోహన్‌నాయుడు అంత సుముఖంగా లేరు. తనకు శ్రీకాకుళం లోక్‌సభ ఎంపీ బాధ్యతలు ఉన్నందువల్ల ఈ పదవికి న్యాయం చేయలేనని, మరెవరినైనా పరిశీలించాలని ఆయన అంటున్నారు. ఈ నెల 27వ తేదీన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి పేరును కూడా ప్రకటిస్తారని ప్రచారం జరిగినా అది నిజం కాదని, రాష్ట్ర కమిటీ ప్రకటన తర్వాత ఉంటుందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఆ రోజు మొత్తం 25 లోక్‌సభ నియోజకవర్గాలకు 25 మంది అధ్యక్షులను ప్రకటిస్తారని వివరించాయి.