అనంతపురం జిల్లాలో నిన్న అర్థరాత్రి దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. అనంతపురం పట్టణంలోని జేఎన్ టీయూ ప్రాంగణంలో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో చొరబడిన దోపిడీ దొంగలు భారీ మొత్తంలో నగదును అపహరించినట్లు తెలుస్తోంది.

అర్థరాత్రి సమయంలో బ్యాంకు వెనుకవైపు కిటీకి అద్దాలు పగులగొట్టి, ఊచల్ని తీసేసి ఇద్దరు దొంగలు బ్యాంకులోకి చొరబడ్డారు. నల్లని ముసుగు ధరించిన దొంగలు బ్యాంకులోకి చొరబడిన దృశ్యాలు  సిసి కెమెరాలో రికార్డయ్యాయి. 

ఈ దోపిడీలో దొంగలు నేరుగా స్ట్రాంగ్ రూం లోకి ప్రవేశించి భారీగా నగదు, నగలు అపమరించినట్లు సమాచారం. దాదాపు 43 లక్షలు చోరీకి గురైనట్లు సమాచారం అందుతున్నప్పటికి అంతకంటే ఎక్కువ డబ్బు చోరీ జరిగిఉంటుందని తెలుస్తోంది. అయితే  ఖచ్చితంగా ఎంత డబ్బు పోయిందో మాత్రం తెలియడం లేదు.

ఇవాళ ఉదయం బ్యాంకును  తెరిచిన వెంటనే దొంగతనం జరిగిందని గుర్తించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అదించారు. దీంతో సంఘటనా స్థలానిక క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ లతో చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బ్యాంకు సిబ్బందితో కలిసి స్ట్రాంగ్ రూంలోకి వెళ్లిన పోలీసులు ఎంత నగదు చోరీ అయిందన్న దానిపై విచారణ జరుపుతున్నారు.అలాగే దొంగల కోసం గాలింపు చేపడుతున్నారు.