అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బం హరికి విశాఖ కో ఆపరేటివ్ బ్యాంక్ నోటీసులు జారీ చేసింది. తీసుకున్న అప్పు చెల్లించకుంటే.. ఆస్తులు జప్తు చేస్తామని బ్యాంక్ ఆయనకు నోటీసులు పంపినట్లు సమాచారం. ఆస్తులు తనఖా పెట్టి తీసుకున్న రుణం వడ్డీ, ఇతర ఖర్చులతో కలిపి రూ.9.54 కోట్లు చెల్లించాల్సి ఉంది. వాయిదాలు చెల్లించకపోవడంతో ఎన్‌పీఏ జాబితాలో చేర్చిన బ్యాంకు ఆర్‌బీఐ నిబంధనల మేరకు మంగళవారం ఆస్తుల స్వాధీనానికి నోటీసులు జారీ చేసింది. 

బకాయిలను 60 రోజుల్లోగా చెల్లించకపోతే సీతమ్మధారలోని 1622 చదరపు గజాల స్థలంలోని నివాసంతో పాటు మాధవధారలోని వుడా లేఅవుట్లో 444.44 చదరపు అడుగుల విస్తీర్ణంలోని  విష్ణు వైభవం అపార్టుమెంట్, విశాఖ బీచ్‌రోడ్‌లోని రుషికొండ దగ్గరలో ఉన్న 800 చదరపు గజాల స్థలాన్ని స్వాధీనం చేసుకుంటామని నోటీసుల్లో పేర్కొంది.

నగరం నడిబొడ్డున మద్దిలపాలెంలో ఉన్న డక్కన్‌ క్రానికల్‌ భవనాన్ని 2014లో కోటక్‌ మహేంద్ర వేలం వేసింది. ఆ వేలంలో రూ.17.80 కోట్లకు సబ్బం హరి పాడుకున్నారు. ఆ సమయంలో తన ఆస్తులను తనఖా పెట్టి విశాఖ కో–ఆపరేటివ్‌ బ్యాంకు నుంచి రూ.8.50 కోట్ల రుణం తీసుకున్నారు. అయితే వేలం నిబంధనల మేరకు నిర్వహించలేదంటూ డక్కన్‌ క్రానికల్‌ (డీసీ) యాజమాన్యం డెబిట్‌ రికవరీ అపిలేట్‌ అథారిటీ (డీఆర్‌ఏపీ)లో కేసు ఫైల్‌ చేసింది.

అథారిటీ డీసీ వాదనను సమర్ధిస్తూ వేలం రద్దు చేయాలని, సబ్బం హరి డిపాజిట్‌ చేసిన రూ.17.80 కోట్లను వడ్డీ సహా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పుపై కోటక్‌ మహేంద్ర అప్పీల్‌కు వెళ్లింది. మరో వైపు ఈ కేసును జాతీయ స్థాయిలో ఏర్పాటైన నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యూనల్‌ (ఏసీఎల్‌టీ)కి రిఫర్‌ చేశారు. దీనిపై తుది తీర్పు రావాల్సి ఉంది.