విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు, సినీ నటి రోజాపై తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు బండారు సత్యనారాయణ మూర్తి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను ఎవరినైనా వేధించినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. 

రోజా క్షమాపణలు చెప్పకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. రోజా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే గుండు గీయిస్తానని ఆయన వ్యాఖ్యానించారు. 

తన 36 ఏళ్ల రాజకీయ జీవితంలో తనపై  ఏ విధమైన మచ్చ లేదని, ఓ పోలీసు స్టేషన్ లోనూ తనపై కేసులు లేవని, ఏ మహిళ కూడా తనపై ఫిర్యాదు చేయలేదని ఆయన అన్నారు. తనపై కేసు ఉందని నిరూపిస్తే తాను గుండు గీయించుకుంటానని అన్నారు. 

"రోజా... నీ క్యారెక్టర్ ఏమిటి, నీ చరిత్ర ఏమిటి, చెన్నైలో నీ జీవితమేమిటో బయటపెట్టాలా" అని ప్రశ్నించారు. చెన్నైలో రోజా వేసిన వేషాలు తమకు తెలుసునని, దమ్ముంటే తనపై వేధింపుల కేసును నిరూపించాలని ఆయన అన్నారు. 

నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే గుండు గీయిస్తానని, రోజా వ్యక్తిగత విషయాలపై తామెప్పుడు కూడా మాట్లాడలేదని, వ్యక్తిగత విషయాలు మాట్లాడితే తాము రోజా చరిత్రను బయటపెడుతామని అన్నారు. 

టీడీపి ఎమ్మెల్యేలు మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారని, బండారు సత్యనారాయణ మహిళలపై వేధింపులకు పాల్పుడుతున్నారని రోజా దాచేపల్లి నిరసన కార్యక్రమంలో ఆరోపించారు. ఈ ఆరోపణలపైనే బండారు సత్యనారాయమ మూర్తి శనివారం మీడియా సమావేశంలో స్పందించారు.